కేశవరావు మరణానికి కూటమి ప్రభుత్వానిదే బాధ్యత
ముంచంగిపుట్టు: విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్న బాబుశాల పంచాయతీ డముకులాడి గ్రామానికి చెందిన గోల్లోరి కేశవరావు (35) మరణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాఽథ్, మృతుడి కుటుంబ సభ్యులు అన్నారు. పోలీసులు పెట్టిన చిత్రహింసలు వల్లనే తన భర్త మృతి చెందాడని కేశవరావు భార్య రంభో ఆరోపించారు. సర్పంచ్ త్రినాఽథ్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గంజాయి కేసులో అనుమానితుడిగా కేశవరావును నాలుగు నెలల క్రితం విశాఖ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇంటిలోకి చొరబడి ఎత్తుకుపోయారని, విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టి, అనారోగ్యం బారిన పడేనట్లు చేశారని చెప్పారు. ఈ నెల 6వ తేదీన కేశవరావు తండ్రి, అన్నయ్యలు విశాఖ సెంట్రల్ జైల్‌కు వెళ్లగా కేశవరావు కేజీహెచ్‌లో ఉన్నాడని చెప్పి పంపించారని, కేజీహెచ్‌కు వెళ్లి చూస్తే మరణించి ఉన్నాడని ఆవేదనగా చెప్పారు. విచారణ పేరుతో కేశవరావుకు చిత్రహింసలు పెట్టారని, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపి నిగ్గు తేల్చి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. లక్ష్మీపురం సర్పంచ్ త్రినాఽథ్ మాట్లాడుతూ గత 9 నెలల్లో ఐదుగురు ఆదివాసీ ఖైదీలు జైలులో మృతి చెందారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం, హోంమంత్రి అనితలు బాధ్యత వహించాలని, ఖైదీ మృతిపై సమాచారం ఇవ్వని పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారని, కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం అందించాలని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్‌పర్సన్లు, మానవ హక్కుల సంఘాలు సుమోటోగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. బాబుశాల, లక్ష్మీపురం పీసా కమిటీ సభ్యులు దళపతి, నీలకంఠం, మల్లేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
కారకులైన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కుటుంబ సభ్యులు, లక్ష్మీపురం సర్పంచ్ కె.త్రినాఽథ్ డిమాండ్
కేశవరావు మరణానికి కూటమి ప్రభుత్వానిదే బాధ్యత
Comments
Please login to add a commentAdd a comment