గురుకులం పిలుస్తోంది..
● ఐదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ● ఈ నెల 13 వరకు గడువు
యలమంచిలి రూరల్: పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో విద్యనందించే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలకు, కళాశాలల్లో 2025–26 సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7 గురుకులాల్లో రానున్న విద్యాసంవత్సరానికి సంబంధించి ఆంగ్ల మాధ్యమంలో ఐదో తరగతి,ఇంటర్ మొదటి సంవత్సరాల్లో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.5 బాలికలు,2 బాలురు పాఠశాలలు, కళాశాలల్లో ఐదో తరగతిలో 560, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 560 సీట్లు భర్తీ చేయనున్నారు.జిల్లాలో నక్కపల్లి, కొక్కిరాపల్లి, తాళ్లపాలెం,నర్సీపట్నం, కోనాంలలో బాలుకలు,దేవరాపల్లి మండలం తెనుగుపూడి, గొలుగొండల్లో బాలురకు గురుకులాలు ఉన్నాయి. ప్రవేశాల కోసం ఈ నెల 13వ తేదీ వరకు గడువు ఉంది. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను గడువులోగా ఆన్‌లైన్‌లో పంపించాలి. ఈ గురుకులాల్లో 5వ తరగతిలో ఒకసారి ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవచ్చు.
పరీక్ష ఇలా..
ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 6న ఉదయం 10 నుంచి 12 గంటల వరకు,ఇంటర్‌లో చేరే వారికి అదేరోజు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఐచ్ఛిక విధానంలో ప్రవేశ పరీక్ష ఉటుంది.ప్రతి తప్పు జవాబునకు 1/4 మార్కు (నెగెటివ్) మార్కు తీసివేస్తారు.ఐదో తరగతికి సంబంధించి నాలుగో తరగతిలో తెలుగు 10,ఆంగ్లం 10,గణితం 15,సైన్స్ 15 కలిపి మొత్తం 50 ప్రశ్నలు(ఒక మార్కు) ఉంటాయి.
ఇంటర్‌కు సంబంధించిన ప్రవేశ పరీక్షలో పదో తరగతిలో గణితం 15, భౌతికశాస్త్రం 15,సామాన్యశాస్త్రం(బయాలజీ) 15,ఆంగ్లం 15,సామాజిక అధ్యయనాలు 10,లాజికల్ రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ 30 కలిపి మొత్తం 100 ప్రశ్నలు(ఒక మార్కు) ఉంటాయి.
సద్వినియోగం చేసుకోవాలి..
ఆంగ్ల మాధ్యమంలో కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఒత్తిడి లేని నాణ్యమైన విద్యా బోధన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ఉంటుంది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం గురుకులాల్లో ప్రతి ఏటా ఐదు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరాల్లో ప్రవేశాల కోసం పరీక్ష నిర్వహిస్తోంది. ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించి అర్హత కలిగిన నిష్ణాతులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాఠాలు బోధిస్తారు. నిర్ణీత సమయంలోగా ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కో గురుకులంలో మొత్తం 80 సీట్లలో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ కేటగిరీకి 60, బీసీ–సీ కి 10, ఎస్టీకి 05, బీసీ 04, ఓసీ 01 చొప్పున కేటాయిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలి.
–మళ్ల మాణిక్యం, ప్రిన్సిపాల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం(బాలికలు), కొక్కిరాపల్లి
అర్హతలు
ఐదో తరగతిలో ప్రవేశానికి ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులు 2012 సెప్టెంబరు 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య,ఓసీ,బీసీ,ఎస్సీ కన్వెర్టెడ్ క్రిస్టియన్లు 2014 సెప్టెంబరు 1 నుంచి 2016 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలి.ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి 2025 ఆగస్టు 31 నాటికి 17 ఏళ్ల వయసు మించకూడదు.ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న వారు మాత్రమే అర్హులు.అభ్యర్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.లక్ష మించకూడదు.అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో htt pr://apbrafcet.apcfrr.in వెబ్‌సైట్ ద్వారా ఈ నెల 13 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. దరఖాస్తులు చేసేటపుడు తప్పులు లేకుండా చూసుకోవాలి. నమోదు సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, తెల్లరేషన్ కార్డు, ఇంతకు ముందు తరగతికి సంబంధించి ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.మొబైల్ నెంబరు తప్పులేకుండా నమోదయ్యేలా చూసుకోవాలి. ప్రతిభ పరీక్షలో మెరిట్ ఆధారంగా నేరుగా ప్రవేశం కేటాయిస్తారు.
వసతులు: ఉచిత వసతి, భోజన సౌకర్యంతో గురుకుల విధానంలో చదువుకునే అవకాశం ఉంది. పౌష్టికాహారం, మూడు జతల ఏకరూప దుస్తులు, దుప్పటి లేక జంకాన, బూట్లు, సాక్సులు, టై, బెల్టు, రాత, పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందిస్తారు. కాస్మోటిక్ ఛార్జీలు, రోజూ వేరుశనగ చిక్కీ, వారానికి ఆరు రోజులు గుడ్లు,రెండు రోజులు చికెన్‌తో భోజనం ఉంటుంది.
గురుకులం పిలుస్తోంది..
గురుకులం పిలుస్తోంది..
Comments
Please login to add a commentAdd a comment