వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు,రేషన్ బియ్యాన్నే అన్నం వండేందుకు వాడతారు.అన్నంలో వేసుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చిమిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకొనిఎంతో ఇష్టంగా తింటారు.రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు,సెల యేళ్లు,సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు.రాత్రి భోజనాల అనంతరం వారి సంప్రదాయ నృత్యాలతో సందడిచేసి నిద్రకు ఉపక్రమించడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి మిర్చి కోతలు పూర్తి అయిన తరువాత కూలి పనులకు వచ్చిన సొమ్ములు,మిర్చి కాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి స్వ గ్రామాలకు పయనమవుతారు.ఇలా వలస కూలీలనే నమ్ముకుని ఇక్కడి రైతులు మిర్చి,పొగాకు సాగు చేస్తుంటారు.వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. చిరు దుకాణాల వ్యాపారాలు మంచిగా సాగుతాయి.