ఎటపాక : మతిస్థిమితం లేని ఓ యువకుడు తిరుమలలో తప్పిపోయి నెల్లిపాకలో దొరికాడు. వివరాలు.. తిరుమల కొండపై ఓ దుకాణం నిర్వాహకురాలైన బద్రిముని అమ్ములు రాణికి ఇద్దరు కుమారులు. వీరిలో చిన్న కుమారుడు దిలీప్(21) ఈ నెల 17న తిరుమల కొండదిగి వచ్చి ఇంటికి తిరిగి వెళ్లలేదు. అప్పటి నుంచి ఆ యువకుడి ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. దిలీప్ వద్ద సెల్‌ఫోన్ ఉన్నప్పటికీ అతడు ఎక్కడ ఉన్నదీ సరిగా చెప్పలేకపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందారు. ఈనెల 23న ఎటపాక మండలం నెల్లిపాక శివారు ప్రాంతం జాతీయ రహదారిపై నడుచుకుంటూ అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని నెల్లిపాక గ్రామానికి చెందిన ముదిగొండ వినయ్‌కుమార్ ప్రశ్నించగా తనది తిరుమల అని భద్రాచలం వచ్చి తిరుగుతున్నట్టు చెప్పాడు. కాగా యువకుడికి మతిస్థిమితం లేదని గ్రహించి అతడి వద్ద స్విచ్‌ఆఫ్ అయిన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టి అందులోని మిస్డ్ కాల్‌కు ఫోన్ చేయగా అతడి తల్లి ఫోన్ లిఫ్ట్‌చేసి తన కుమారుడు ఎక్కడ ఉన్నదీ తెలుసుకుని, పరిస్థితిని వివరించింది. దీంతో ఆ యువకుడిని చేరదీసి రాత్రంతా ఉంచి ఉదయం భద్రాచలంలోని సిటీస్టైల్ జిమ్ నిర్వాహకుడు గొంగడి వెంకటరామిరెడ్డి వద్దకు చేర్చాడు. సోమవారం ఉదయం సదరు యువకుడి సోదరుడు ప్రసాద్.. తిరుమల నుంచి భద్రాచలం రావడంతో అతడికి దిలీప్‌ను అప్పగించడంతో వారు కృతజ్ఞత లు తెలిపారు.