రాజవొమ్మంగి: జాతీయ రహదారి 516ఇ నిర్మాణ పనులను దూసరపాము గ్రామస్తులు మంగళవారం రాత్రి అడ్డుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ గ్రామ సరిహద్దులో ఉన్న మూడు ఇళ్లను తొలగించాలని అధికారులు గుర్తించారు. దాదాపు రూ.కోటి వరకు నష్టపరిహారం ఇస్తామని ఆరు నెలల కిందట హామీ ఇచ్చారు. అదే సమయంలో ఈ గ్రామానికి వచ్చిన సబ్‌కలెక్టర్ కల్పశ్రీ రహదారి పనులు ముందుకు సాగేందుకు సహకరించాలని నిర్వాసితులను కోరారు. ఒక నెలలోనే నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. నెలరోజుల కిందట ఆ మూడు ఇళ్లను తొలగించి, రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందకపోవడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులు, గ్రామస్తులు రహదారి నిర్మాణపనులను, లారీలను అడ్డుకున్నారు. దీంతో స్థానిక ఎస్‌ఐ నరసింహమూర్తి, పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గ్రామస్తులకు ఎస్‌ఐ సర్ది చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళతామని సర్పంచ్ శివ, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ గ్రామస్తులకు నచ్చజెప్పడంతో వారు శాంతించారు.
రోడ్డుపై బైఠాయించిన నిర్వాసితులు,
గ్రామస్తులు