ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై ధ్వజం
చింతపల్లి: భారత ప్రజాస్వామ్య విలువలు కాపాడే పార్లమెంటులోనే గిరిజన మహిళా ప్రజాప్రతినిధి పట్ల ప్రొటోకాల్ పాటించకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని చింతపల్లి ఎంపీపీ కోరాబు అనూషదేవి అన్నారు. ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. మన్య ప్రాంతంలో ఆర్గానిక్ కాఫీగా పేరు గాంచి, పార్లమెంటులోనే అరుకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేసి ఆ ప్రారంభ కార్యక్రమానికి అదే ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అరుకు పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ గుమ్మా తనూజారాణిని ఆహ్వానించక పోవడంపై ఎంపీపీ అనూషదేవి తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్లమెంటు సాక్షిగా జరిగిన ఈ సంఘటనపై ఎన్డీఏ ప్రభుత్వ తీరును యావత్ దేశం తప్పు పడుతుందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై న ఎంపికే తెలియకుండా కార్యక్రమాలు చేపట్టడం దారుణమన్నారు. దేశ స్థాయిలోనే ఇటువంటి కార్యక్రమాలు జరిగితే రాష్ట్ర, జిల్లా, గ్రామీణస్థాయిలో ప్రజాప్రతినిధులు పట్ల ఎటువంటి గౌరవం ఉంటుందో ఆలోచించాలన్నారు.ఇటువంటి చర్యలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శన మన్నారు. పార్లమెంటు ఆవరణలో ప్రారంభోత్సవానికి అరుకు ఎంపీ తనూజారాణిని ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీపీ అనూషదేవి డిమాండ్ చేశారు.