ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ధర
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: క్రికెట్ ప్రేమికుల ఉత్సాహాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సొమ్ము చేసుకుంటోంది. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో ధరను వసూలు చేస్తూ దోపిడీకి తెరలేపుతోంది. ఈ నెల 24వ తేదీన జరిగిన ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను రూ.వెయ్యి నుంచి రూ.15 వేల వరకు ధర నిర్ణయించి విక్రయాలు చేపట్టింది. ఈ నెల 30వ తేదీన ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్‌కు ఒకేసారి టికెట్ల ధరలను పెంచేసింది. రూ.1,250 నుంచి రూ. 20 వేల వరకూ టికెట్ల ధరలను నిర్ణయించింది. టికెట్ల విక్రయాలు కూడా ఒక పద్ధతి ప్రకారం చేపట్టడం లేదు. ఢిల్లీ క్యాపి టల్స్–లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యా చ్‌లో టికెట్ల అమ్మకాలు కూడా సరిగ్గా జరగలేదు. దీంతో గ్రౌండ్‌లో సగం మంది కూడా ప్రేక్షకులు కనిపించలేదు. ఇటువంటి పరిస్థితుల్లోనూ టికెట్ల విక్రయాల్లో పారదర్శకత పాటించకుండా గుంభనంగా ఇష్టారీతిలో ఏసీఏ పెద్దలు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పూర్తిగా టీడీపీ నేతలతోనే ఏసీఏ నిండిపోవడంతో తమకు అడ్డేముందనే రీతిలో వీరి ప్రవర్తన ఉందని క్రికెట్ ప్రేమికులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు చేపట్టకుండా ఏసీఏ పెద్దలు అంతా లోలోపల వ్యవహారాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
టికెట్ల ధరలు అమాంతం పెంచేశారు
విశాఖలో ఐపీఎల్ టికెట్ల విక్రయాల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతోందనే ఆరోపణలున్నాయి. మ్యాచ్ మ్యాచ్‌కు టికెట్ల ధరల్లో వ్యత్యాసం ఉండటంతో పాటు భారీ ధరలతో క్రికెట్ అభిమానులు నిరాశకు లోనవుతున్నారు. గత మ్యాచ్‌లో రూ.వెయ్యి ఉన్న లోయర్ డినామినేషన్ టికెట్ ధరను రూ.1250లకు పెంచారు. బీ స్టాండ్‌లోని రూ.2 వేల టికెట్‌ను రూ.2,500లకు, ఐ, సీ స్టాండ్ రూ.3 వేలు టికెట్ ధరను రూ.4 వేలకు పెంచి విక్రయిస్తున్నారు. ఇక సౌత్ వెస్ట్ అప్పర్, సౌత్ ఈస్ట్ అప్పర్ స్టాండు టికెట్ ధర గత మ్యాచ్‌లో రూ.5 వేలు ఉండగా.. ఇప్పుడు కాస్తా రూ.6 వేలకు పెంచేశారు. ఇక సౌత్ వెస్ట్ లోయర్, సౌత్ ఈస్ట్ లోయర్ ధరలను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు అమాంతంగా పెంచి విక్రయిస్తున్నారు. ఇక బాక్సుల ధరలు కాస్తా రూ.15 వేల నుంచి రూ.20వేలకు పెంచేశారు. క్రికెట్ అభిమానాన్ని ఈ విధంగా అడ్డగోలుగా దోచుకునేందుకు ఏసీఏ ప్రయత్నిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఇవేవీ సదరు ఏసీఏ కార్యవర్గం పట్టించుకునే స్థితిలో లేకపోవడం గమనార్హం.
అన్నీ ఆన్‌లైన్‌లోనే..! : గతంలో ఏ మ్యాచ్ అయినా ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోను టికెట్ల విక్రయాలు చేపట్టేవారు. ఈసారి మాత్రం ఆఫ్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు జరగలేదు. గతంలో క్యూలో ఉంటే తమకు టికెట్ దొరుకుతుందనే ఆశతో క్రికెట్ అభిమానులు కొనుగోళ్లకు ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఎప్పుడు టికెట్లను విక్రయిస్తారా అని వేచిచూడాల్సి వస్తోంది. ఒకవేళ ఆ సమయానికి సరిగ్గా ఆన్‌లైన్‌లో ఉండి.. టికెట్లను కొనుగోలు చేద్దామంటే మీ కంటే ఇంకా కొన్ని వేల మంది క్యూలో ఉన్నారంటూ వస్తోంది. అంత సమయం ఓపికగా వేచి ఉండి.. టికెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే.. ముందు వరుసలోని సీట్లన్నీ అప్పటికే అమ్మకాలు జరిగినట్టుగా చూపెడుతోంది. ఈ ముందు వరుసలోని సీట్లన్నీ ఏసీఏలోని నేతలు వారి అనుచరులకే కట్టబెడుతున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏకంగా రూ.6 వేలు, రూ.12 వేలు, రూ.20 వేల వరకూ చెల్లించి కొనుగోలు చేసే టికెట్లను కూడా వెనుక వరుసలో ఉండి చూడాల్సి వస్తోందని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు. ఫలితంగా అనేక మంది టికెట్లను కొనుగోలు చేయకుండానే ఉండిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత మ్యాచ్‌లో గ్రౌండ్ సగం వరకు ఖాళీగా దర్శనమిచ్చింది. ఈ దఫా కూడా ఏసీఏలో ఎటువంటి మార్పు రాలేదని అభిమానులు మండిపడుతున్నారు. అయితే టికెట్ల విక్రయంతో తమకు నేరుగా సంబంధం లేదని.. సదరు ఫ్రాంచైజీలే చూసుకుంటాయంటూ ఏసీఏ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
హడావుడితో అభాసుపాలు : డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రెండో హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకుంది. ఇక్కడ రెండు మ్యాచ్‌లు ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో స్టేడియాన్ని ఆధునికీకరించాలని ఏసీఏ భావించింది. ఇందులో భాగంగా స్టేడియానికి గల డాక్టర్ వైఎస్సార్ పేరును తొలగించి విమర్శలు ఎదుర్కొంది. ఆ తర్వాత పేరు తొలగించలేదంటూ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. టికెట్ల విక్రయాల్లోనూ అదే పంథాను కొనసాగించింది. రెండో మ్యాచ్‌కు అధిక ధరలకు టికెట్లు విక్రయించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఏసీఏ వ్యవహారశైలితో క్రికెట్ ప్రేమికులకు నిరాశే మిగులుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత మ్యాచ్‌లో రూ.వెయ్యి నుంచి రూ.15 వేల వరకు ధరలు
30 నాటి మ్యాచ్‌కి రూ.1,250 నుంచి రూ.20 వేల వరకు పెంపు
రూ.5 వేల టికెట్.. రూ.6 వేలకు పెంచిన వైనం
రూ.15 వేల టికెట్ కాస్తా రూ.20 వేలకు అమ్మకం
భారీ ధరలతో క్రికెట్ ప్రేమికులకు నిరాశ