మహారాణిపేట (విశాఖ): అనుకోని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి బి.హెచ్.భవానీ శంకర్ సూచించారు. అగ్ని ప్రమాదాలు, టెర్రరిస్టుల దాడుల విషయంలో అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. టెర్రరిస్టు దాడులు, ఇతర ఆపదలను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆక్టోపస్ రాష్ట్ర ఆపరేషన్ అధికారి డీఎస్పీ జగ్గునాయుడు, డీఎస్పీ మధుసూదనరావు ఆ సంస్థ అందిస్తున్న సేవలను వివరించారు. ఊహించని ప్రమాదాల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఆక్టోపస్ పని చేస్తోందని, రాష్ట్రంలోని తిరుపతి, గన్నవరం కేంద్రాలుగా రెండు ఆపరేషన్ యూనిట్లు ఉన్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో మూడో యూనిట్‌ను నెలకొల్పేందుకు యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆక్టోపస్ శిక్షణ, ఇతర కార్యక్రమాలకు సంబంధించిన వీడియోను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్టోపస్ మిగతా రాష్ట్రాల్లోని సంస్థల కంటే భిన్నంగా సేవలందిస్తోందని గుర్తు చేశారు. ఆక్టోపస్ ఆపరేషన్ టీం అధికారులు, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ఈపీడీసీఎల్ ఎస్‌ఈ శ్యాంబాబు, అగ్నిమాపక శాఖ ఏడీఎఫ్‌వో సింహాచలం, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.