
వరుస ఘటనలతో బెంబేలు
ఒకప్పుడు శాంతిభద్రతలకు నెలవుగా మారిన విశాఖ వరుస ఘటనలతో వణికిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మహిళలపై వరుస దాడులతో నగర ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన పది నెలల కాలంలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
● మూడు రోజుల క్రితం డాన్సర్లు అయిన భార్యాభర్తలు మధ్య జరిగిన గొడవలో.. భర్త చేసిన దాడిలో భార్య గాయపడి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
● మార్చి 31న మధురవాడ వాంబేకాలనీలో ఐదేళ్ల చిన్నారిపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగికదాడికి పాల్పడ్డాడు.
● మార్చి 29న తండ్రిపై కొడుకు బ్లేడ్‌తో దాడి చేసి హత్య చేసిన ఘటన ఆరిలోవలో చోటుచేసుకుంది.
● మార్చి 28న బర్మా క్యాంపు సమీపంలో హనుమంతరావు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు చెట్టుకు కట్టి హత్య చేశారు.
● మార్చి 27న సాలూరుకి చెందిన ఐశ్వర్య అనే యువతిని రాంబాబు అనే వ్యక్తి విశాఖలో హత్య చేసి సాలూరు ప్రాంతంలో చెట్టుకు వేలాడదీసి ఆత్మహత్యకు పాల్పడినట్లు చిత్రీకరించాడు.
● మార్చి 20న గాజువాక శ్రీ నగర్‌లోని ఇంట్లో జరిగిన దొంగతనంలో 15 తులాల బంగారాన్ని అపహరించారు.
● ఫిబ్రవరి 28న ఐదేళ్ల బాలికపై ఓ షాప్ సెక్యూరిటీ గార్డ్ మేడమీదకు తీసుకెళ్లి అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక కేకలు వెయ్యడంతో స్థానికులు ఈ దారుణాన్ని అడ్డుకున్నారు.
● ఫిబ్రవరి 5న హెచ్‌బీకాలనీ సింహాద్రిపురంలో పదేళ్ల బాలికపై 35 ఏళ్ల గణేష్ అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు.
● మార్చి 2న ద్వారకాపోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇంటిని పగలగొట్టి 30 తులాల బంగారం, రూ.45 వేల క్యాష్ చోరీకి పాల్పడ్డారు.
● మార్చి నెలలో అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన మహిళను ఫైనాన్స్ వ్యాపారులు వేధిస్తుండటంతో అప్పు ఇచ్చిన వారి ఇంట్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
● గత జనవరిలో పీఎం పోలీస్ స్టేషన్ పరిధిలో మిథిలాపురి వుడా కాలనీలో ఒక మహిళను నడి రోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం రేపింది.