
60 శాతమే రక్త పరీక్షలు
కొయ్యూరు: రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు తప్పని సరి. అయితే ఆ పరీక్షలు సక్రమంగా సాగక వ్యాధి నిర్ధారణలో జాప్యం జరుగుతోంది. దీంతో సకాలంలో వైద్యం అందక రాజేంద్రపాలెం పీహెచ్‌సీ పరిధిలో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాడేరు డివిజన్‌లో అధిక పరిధి గల రాజేంద్రపాలెం ఆస్పత్రిలో ఒకే ఒక ల్యాబ్ టెక్నీషియన్ ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ఈ పీహెచ్‌సీ పరిధిలో 17 సచివాలయాలు న్నాయి. వీటి పరిధిలో సుమారు 40 మంది ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు రక్త నమూనాలను సేకరించి, పీహెచ్‌సీకి పంపుతారు. ఈ మూడు నెలలు ఎపిడమిక్‌గా పరిగణించి, అధికంగా రక్త పూతలు సేకరించి, పరీక్షస్తారు. ఈ పీహెచ్‌సీలో ఓపీ 140 వరకు ఉంటుంది. వీరిలో సుమారు 40 మందికి వరకు రక్తపరీక్షలు చేస్తారు. ఇలా నెల రోజుల్లో సుమారు 2,500 వరకు రక్త పరీక్షలు చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక్క ల్యాబ్‌టెక్నీషియన్ ఉన్నారు. నిబంధనల ప్రకారం రోజుకు 60 రక్త పరీక్షలు చేయాలి. ఆ ప్రకారం సెలవు దినాలు మినహాయిస్తే సుమారు నెలకు 1500 అంటే సుమారు 60 శాతం పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయి. ఒక సారి రక్త సేకరణ చేస్తే మూడు రోజుల లోపు పరీక్ష చేయాలి.లేకుంటే మళ్లీ సేకరించాలి. పీహెచ్‌సీలో ఇద్దరికి గాను ఒక్కరే ల్యాబ్ టెక్నీషియన్ ఉండడంతో పూర్తిస్థాయిలో సకాలంలో రక్త పరీక్షలు జరగడం లేదు. దీంతో వ్యాధి నిర్ధారణలో జాప్యం జరిగి, రోగులు సకాలంలో వైద్య సేవలు పొందలేకపోతున్నారు. అదనంగా మరో ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించాలని ప్రతిపాదించినా ఇంత వరకు పట్టించుకోలేదు.దీనిపై జిల్లా మలేరియా అధికారి తులసి మాట్లాడుతూ ఈ సమస్యను డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు.
సకాలంలో వ్యాధి నిర్ధారణ కాక
వైద్యసేవల్లో జాప్యం
అవస్థలు పడుతున్న రోగులు
రాజేంద్రపాలెం పీహెచ్‌సీలో రెండో ల్యాబ్ టెక్నీషియన్ లేక ఇబ్బందులు