
పేదింట ఉడకని కందిపప్పు
ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పింది. పేదలకు సబ్సిడీపై అందించాల్సిన నిత్యావసరాలపై నిర్లక్ష్యధోరణి పెరుగుతోంది. రేషన్ తీసుకుంటే తప్ప పూటగడవని గిరిజన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కార్డుదారులకు అందించే కందిపప్పునకు ఈ నెల కూడా ఎగనామం పెట్టారు.
సాక్షి,పాడేరు: రేషన్‌కార్డుదారులకు ప్రతి నెలా పంపిణీ చేయవలసిన కందిపప్పు సరఫరాలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. పేదలకు ఆహారభద్రత కార్యక్రమంలో భాగంగా సబ్సిడీపై రూ.67కి కిలో కందిపప్పు అందజేయాలి. గత రెండు నెలల నుంచి బియ్యం,పంచదార మాత్రమే రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. మారుమూల గ్రామాల కార్డుదారులకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తిస్థాయిలో కంది పప్పు అందని పరిస్థితి నెలకొంది. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు సరఫరాను ప్రభుత్వం నిలిపివేయడంతో జిల్లాలో పంపిణీ కాలేదు.ఈనెలలో కందిపప్పు సరఫరా జరుగుతుందని పేదలంతా ఆశపడినప్పటికీ పంచదార,బియ్యంతోనే సరిపెట్టారు.
290 టన్నులు అవసరం
జిల్లాలోని 22 మండలాల్లో 671 డీఆర్ డిపోలు, 221 ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేస్తున్నారు. 2,98,092 రేషన్‌కార్డులున్నాయి.వీరికి రాయితీపై పంపిణీ చేసేందుకు ప్రతినెలా సుమా రు 290 టన్నుల కందిపప్పు అవసరం. జిల్లాలో 83 శాతం రేషన్‌కార్డులు గిరిజన కుటుంబాలవే. ఒక వైపు పౌష్టికాహార వినియోగంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తూ, మరోవైపు కంది పప్పు ఇవ్వకపోవడంతోనిరుత్సాహంచెందుతున్నారు.
ప్రైవేట్ మార్కెట్‌లో కిలో రూ.130
కందిపప్పు ధర ప్రైవేట్ మార్కెట్‌లో కిలో రూ.130 ఉంది.మార్కెట్‌లో ధర పెరగడంతో ప్రభుత్వం రాయితీపై పంపిణీ చేసే కందిపప్పు కోసం కార్డుదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రాయితీపై కందిపప్పు పంపిణీని పౌరసరఫరాల శాఖ పూర్తిగా విస్మరించింది. అడిగితే స్టాక్ లేదనే సమాధానంతో సరిపుచ్చుతున్నారు. ప్రైవేట్ మార్కెట్‌లో అధిక ధరతో కందిపప్పును కొనుగోలు చేయలేక పేదప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పేదలకు సబ్సిడీపై కందిపప్పును ప్రతినెలా పంపిణీ చేయాల్సిన పాలకులు ఇంత నిర్లక్ష్యం చేయడం దారుణమంటూ రేషన్‌కార్డుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బియ్యం,కందిపప్పు,పంచదారను ప్రతి నెల రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసేవారు.
ఈనెల కూడా బియ్యం, పంచదారకే పరిమితం
రెండు నెలలుగా రేషన్‌కార్డుదారులకు అందని కందిపప్పు
ప్రైవేట్ మార్కెట్‌లో కిలో రూ.130
ఈ నెలా కందిపప్పు ఇవ్వలేదు
గత నెలలో కందిపప్పు పంపిణీ చేయలేదు.ఈనెల కూడా బియ్యం,పంచదార మాత్రమే ఇస్తున్నారు.ప్రభుత్వం నుంచి కందిపప్పు సరఫరా లేదంటూ ఎండీయూ వాహనాల సిబ్బంది చెబుతున్నారు.ప్రైవేట్ షాపుల్లో అధిక ధరకు కందిపప్పును కొనుగోలు చేయలేకపోతున్నాం
– పాంగి రాజారావు, రేషన్‌కార్డుదారుడు, పాడేరు
అధిక ధరకుకొనలేకపోతున్నాం
ప్రతి నెలా బియ్యం,పంచదారను పంపిణీ చేస్తున్నప్పటికీ రెండు నెలల నుంచి కందిపప్పు ప్యాకెట్లు ఇవ్వడం లేదు.కందిపప్పు పంపిణీ లేక ఇబ్బందులు పడుతున్నాం.సంతల్లో అధిక ధరకు కొనుగోలు చేయలేకపోతున్నాం.
– పాంగి సనాతి, వాకపల్లి, పాడేరు మండలం

పేదింట ఉడకని కందిపప్పు

పేదింట ఉడకని కందిపప్పు

పేదింట ఉడకని కందిపప్పు