
సమాజానికి దిక్సూచి ఉపాధ్యాయులు
రంపచోడవరం: ఉపాధ్యాయులు సమాజానికి దిక్సూచులని, భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యత ఉందని డీడీ రుక్మాండయ్య అన్నారు. స్ధానిక ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో శుక్రవారం ఆర్ట్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు కళలను మెరుగుపర్చుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ ఎం.చినబాబు మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానం, నైపుణ్యాలు అందించడమే కాకుండా వారిలో నైతిక విలువలు ఆలోచన విధానాలు పెంపొందిస్తూ సమాజంలో మంచి పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు ప్రత్యేక పాత్ర పోషిస్తారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన 60 రకాల నమూనాలను ప్రదర్శంచారు. ఆర్ట్స్ మేళాను తిలకించడానికి వివిధ విద్యాలయాల నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, తరలివచ్చారు.ఉత్తమ చిత్రాలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన నమూనాల్లో ప్రథమ బహుమతి బి.అనిత, ద్వితీయ బహుమతి కె.చరణ్, తృతీయ బహుమతి ఎం.ఉదయ్, యు.లచ్చిరెడ్డి, ఏ.నాగరాజు, ఎ.తనూషలు సాధించారు. వైస్ ప్రిన్సిపాల్ ఎస్.సూర్యనారాయణ, భాస్కర్‌రావు తదితరులు పాల్గొన్నారు.