
సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర
ముంచంగిపుట్టు: సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కూటమి ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న క్లస్టర్ విధానం అత్యంత దుర్మార్గమైనదని చెప్పారు. సచివాలయాల కుదింపు వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని, సచివాలయ వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలని కోరుతూ ఉద్యోగులు చైర్‌పర్సన్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మండల కేంద్రం ముంచంగిపుట్టులో శుక్రవారం గ్రామ సచివాలయాల ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను నాశనం చేసేందుకు పూనుకుంటోందన్నారు.ప్రజలకు సుపరిపాలన అందించాలని,సంక్షేమ పథకాలు మరింత చేరువ చేయాలనే మంచి ఆలోచనతో మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారని, ఈ విధానానికి దేశమంతటా ప్రశంసలు లభిస్తుంటే దానిని చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేక క్లస్టర్ విధానాన్ని తీసుకువస్తోందన్నారు.రెండు సచివాలయాలను ఒక క్లస్టర్‌గా మార్చే ఆలోచన చేస్తోందని,దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవన్నారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆమె కోరారు.