
నరసింగబిల్లిలో బాలిక ఆత్మహత్య
కశింకోట : నరసింగబిల్లిలో ఒక బాలిక ఉరి పోసుకొని ఆత్మహత్య చేసుకొంది. సీఐ అల్లు స్వామినాయుడు శనివారం అందించిన వివరాల ప్రకారం..నరసింగబిల్లిలోని జంగాల కాలనీలో నివాసం ఉంటున్న పిల్లిబోయిన బ్యూల (15) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరిపోసుకొని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై ఫిర్యాదు అందడంతో ఎస్‌ఐ లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి శనివారం పోస్టుమార్టం జరిపించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలు ఇటీవల టెన్త్ పరీక్షలు రాసింది. నూతలగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం గ్రామానికి చెందిన ఆమె తల్లి దుర్గ, తండ్రి కూలి పని చేసుకుంటూ నరసింగబిల్లిలో పదేళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరు ఎప్పటిలాగే కూలి పనికి వెళ్లిపోయాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్యూల ఆత్మహత్యకు ఒడిగట్టింది. ఇందుకు స్పష్టమైన కారణాలు తెలియరాలేదు. అయితే ఇంటి పక్కన ఉన్న ఓ యువకుడు ప్రేమ పేరుతో కొంత కాలంగా వేధిస్తుండడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఆ యువకుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం. దీంతో ఆ కోణంలో ఆత్మహత్య సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఒక సోదరుడు ఉన్నారు. తండ్రి వరహాలబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.