
హోమ్‌స్టేలతో గిరిజనులకు ఉపాధి
సాక్షి, పాడేరు: పర్యాటకుల కోసం గిరిజన గ్రామాల్లో హోమ్‌స్టేలు ఏర్పాటు చేస్తే గిరిజనుల అభివృద్ధికి దోహదపడుతుందని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన జిల్లాలోని పలు శాఖల అధికారులు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హోమ్‌స్టేల వల్ల గిరిజనుల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. కొత్తగా ఇల్లు నిర్మించుకునే గిరిజనులు పాత ఇళ్లను కూల్చకుండా హోమ్‌స్టేలుగా ఉపయోగించాలన్నారు. డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో 15 హోమ్‌స్టేలను నిర్మించాలన్నారు. తాజంగి, లంబసింగిలో ఎన్ని హోమ్‌స్టేలు గుర్తించారని ఎంపీడీవోలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో శిల్పారామం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, పాడేరు, హుకుంపేట మండలాల్లో అవసరమైన భూములను పరిశీలన చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. పర్యాటక ప్రాంతాలు కలుషితం కాకుండా ప్లాస్టిక్ సంచుల అమ్మకాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్లాస్టిక్ సంచుల విక్రయాలు చేపడుతున్న దుకాణాలను గుర్తించి సీజ్ చేయాలన్నారు. అరకులోయ, పాడేరు, అడ్డతీగల, రాజవొమ్మంగి మండల కేంద్రాలలో రహదారులను ఆక్రమించి రవాణాకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ చట్టాలను సమర్థవంతంగా అమలుచేయాలని, పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఆక్రమణలపై తనిఖీలు చేపట్టి, నోటీసులు జారీ చేయాలన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, జెడ్పీ నిధుల మంజూరుపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ అభిషేక్‌గౌడ్, రంపచోడవరం ఐటీడీఏ పీవో సింహాచలం, సబ్ కలెక్టర్లు కల్పశ్రీ, సౌర్యమన్‌పటేల్, డీఎఫ్‌వో సందీప్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ మురళీ, సీపీవో పట్నాయక్, డీటీవో దాసు, అరకులోయ మ్యూజియం క్యూరేటర్ మురళీ, అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
గిరిజన గ్రామాల్లో ఏర్పాటుకు చర్యలు
జిల్లాలో శిల్పారామం కోసం భూముల పరిశీలన
ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తే దుకాణాల సీజ్
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్
దినేష్‌కుమార్