
చోడవరం రూరల్ : ప్రేమ వ్యవహారంలో ఘర్షణ జరిగి కత్తితో ఓ యువకుడిని తీవ్రంగా గాయపరిచిన ఉదంతమిది. కేసు దర్యాప్తు చేస్తున్న చోడవరం ఎస్‌ఐ ఎ.సూర్యనారాయణ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అడ్డూరు గ్రామానికి చెందిన శానబోయిన దేముడుబాబు(27) గవరవరం గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు.
అయితే ఆ యువతికి మూడు నెలల క్రితం మరో వ్యక్తితో వివాహం జరిగింది. ఈ విషయమై మాట్లాడాలని యువతికి వరుసకు బావ అయిన నర్సాపురానికి చెందిన సబ్బి రమణ, యువతి సోదరుడు బోరా దేముడుబాబు అడ్డూరు మజ్జి గౌరమ్మ గుడి సమీపంలోని కొండ వద్దకు రావాలని యువతి ప్రేమికుడు దేముడుబాబుకు గురువారం మధ్యాహ్నం కబురు పంపారు.
అక్కడ వీరి మధ్య మాటామాటా పెరగడంతో మేకలకు మేత కొమ్మలు కోయడానికి తెచ్చుకున్న కత్తితో ప్రేమికుడిపై దాడి చేశారు. దీంతో శానబోయిన దేముడుబాబుకు వీపుపై తీవ్రంగా గాయమైంది. గాయంతో విలవిలలాడుతున్న అతనిని వదలిపెట్టి వారిద్దరూ పరారయ్యారు. గాయపడిన దేముడుబాబు గ్రామానికి చేరుకోవడంతో బంధువులు అతన్ని విశాఖపట్నం విమ్స్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment