సాక్షి, అనకాపల్లి: ‘భవిష్యత్తు గ్యారెంటీ’ అనే పేరుతో జిల్లాలో టీడీపీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర చప్పగా సాగుతోంది. పాయకరావుపేట, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం నియోజవర్గాల్లో ఆశించిన స్థాయిలో స్పందన లేక అడుగడుగునా యాత్ర డీలా పడింది. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దూషించాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ యాత్రకు జనాదరణ లేకపోవడంతో టీడీపీ అధిష్టానం ఆశలన్నీ నీరుగారాయి. ఇక యాత్రలో సెల్ఫీచాలెంజ్ కార్యక్రమమైతే మొదటిరోజే తుస్సుమంది.
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనితల వ్యతిరేక వర్గానికి నాయకత్వం వహిస్తున్న మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వర్గీయులు ఈ యాత్రను పట్టించుకోలేదు. జిల్లాలో అధికంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులైతే యాత్రకు ఆది నుంచి దూరంగా ఉంటున్నారు. యాత్ర ప్రారంభంలోనే పాయకరావుపేటలో వంగలపూడి అనిత వ్యతిరేక వర్గం ఈ యాత్రలో పాల్గొనడం లేదు. ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపు సీనియర్ టీడీపీ నాయకులంతా పాల్గొంటారని తెలుగు తమ్ముళ్లు ఆశించినా...పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పూర్తిగా డుమ్మాకొట్టారు.
జిల్లాలో యాత్రను మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత నాయకత్వంలో సాగడం ఇష్టంలేకనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు డుమ్మాకొట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఉన్న పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులందరిని ఆహ్వానించి తమ సత్తా నిరూపించుకోవాలని చేసిన ప్రయత్నాలకు ఆదిలోనే విఫలమయ్యాయి.
అయ్యన్న ఇలాకాలో అసమ్మతి ‘గంట’
బస్సు యాత్ర పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ప్రారంభమైనప్పటి నుంచి నర్సీపట్నం వరకూ అడుగడుగునా ఇబ్బందులే ఎదురయ్యాయి. గత ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గంలో టీడీపీ పాతాళంలోకి కూరుకుపోయింది. ఇప్పుడు కూడా ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. తనకు తిరుగులేదని చెప్పుకునే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నాయకత్వంలో సాగిన మూడోరోజు యాత్రలో సొంత నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ముత్యాలపాప, యర్రాపాత్రుడు పాల్గొనలేదు.
ఏడాదిగా అయ్యన్నపై గుర్రుగా ఉంటున్న వీరిపై గంటా వర్గంగా కూడా ముద్ర ఉంది. గతంలో మాజీ మంత్రి గంటాపై అయ్యన్న నోరు జారినప్పటి నుంచి వీరు పూర్తిగా అయ్యన్నకు దూరంగా ఉంటున్నారనే ఆరోపణలు కాస్త ఈ యాత్రతో మరింత బట్టబయలయ్యాయి. టీడీపీ సీనియర్ నేత రుత్తల యర్రాపాత్రుడు తన గ్రామంలో ఒక ఉత్సవానికి నియోజకవర్గంలో టీడీపీ నాయకులందరినీ పిలిచారు గానీ..అయ్యన్నను, ఆయన వర్గీయులను పిలవలేదు.తాజా పరిణామమంతో విభేదాలు తేటతెల్లమయ్యాయి.
అసహనంగా తెలుగు తమ్ముళ్లు..
ఈ యాత్రతో జిల్లాలో పార్టీ భవిష్యత్తు కనుమరుగవుతుందేమోనని తెలుగు తమ్ముళ్లు భయపడుతున్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న సీనియర్లంతా వస్తారేమో అన్న వారి ఆశ నిరాశైంది. నేతల్లో విభేదాలు ఈ యాత్రలో స్పష్టంగా కనిపించాయి. షెడ్యూల్ ప్రకారం యాత్ర జరగకపోవడంతో కార్యకర్తల్లో అసహనం మొదలైంది. ఏ సమయంలో యాత్ర వస్తుందో...రూట్ మ్యాప్ ఎలాగో కూడా తెలియక సతమతమైపోతున్నారు. తమ ప్రాంతానికి ఎప్పుడోస్తారో..యాత్రలో ఏ నాయకుడు మాట్లాడతాడో కూడా వచ్చే వరకూ కూడా కార్యకర్తలు తెలియడంలేదు. ఒక్క మొదటి రోజు మినహాయిస్తే ఏ రోజూ కూడా యాత్ర సక్రమంగా సాగలేదని టీడీపీ కార్యకర్తలు చిరాకుకు లోనవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment