పన్నుకు ఎగనామం
● రైతుల పేరిట సరకు రవాణా ● చెక్ పోస్టుల్లో కొరవడిన నిఘా
నర్సీపట్నం : వ్యవసాయ ఉత్పత్తులు దొడ్డిదారిన సరిహద్దు దాటిస్తున్నారు. వ్యాపారులే రైతుల అవతారమెత్తి సెస్సుకు ఎగనామం పెడుతున్నారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన పంటలకు మార్కెట్ ఫీజుగా వ్యాపారి 1 శాతం చెల్లించాలి. అప్పుడే ఇతర ప్రాంతాలకు తరలించడానికి వీలుంటుంది. రైతుల పేరుతో తీసుకెళ్లే సరుకుకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీంతో రెవెన్యూ సిబ్బంది చేయి తడిపి పంట ధ్రువీకరణ పత్రం తీసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. వరి ధాన్యం, అపరాల పంటలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. పంట ఉత్పత్తులను తరలిస్తున్న వాహనాలను చెక్ పోస్టుల వద్ద పక్కాగా తనిఖీ చేయాలి. వాహనంలో ఎంత విలువైన సరకు ఉందో అంచనా వేయాలి. కానీ తనిఖీ కేంద్రాల వద్ద సిబ్బంది ఇవేవీ పట్టించుకోవడం లేదు.
రూ.2 కోట్ల సెస్ వసూళ్లు లక్ష్యం..
నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచి రూ.2 కోట్లు సెస్సు వసూలు చేయాలనేది లక్ష్యం. దీనిపై సిబ్బంది దృష్టి సారించడం లేదు. మార్కెట్ యార్డు పరిధిలో ఎనిమిది చెక్‌పోస్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2024–25 ఆర్ధిక సంవత్సరానికి రూ.2 కోట్లు సెస్సు వసూలు చేయాల్సి ఉంది. ఈ నెల 17 నాటికి రూ. 1.24 కోట్లు ఆదాయం గతేడాది ఇదే సమయానికి రూ.1.56 కోట్ల ఆదాయం వచ్చింది. వీటి నుంచి సెస్సు వసూలు చేయాల్సి ఉండగా రూ.1.24 కోట్లు వసూలు చేయడం గమనార్హం. ఆయా తనిఖీ కేంద్రాల్లో వద్ద సిబ్బంది ఇవేవీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.
సిబ్బంది కొరత...
ఈ విషయమై మార్కెట్ కార్యదర్శి భువనేశ్వరిని వివరణ కోరగా మార్కెట్ పరిధిలో బలిఘట్టం, గన్నవరంమెట్ట, రాజుపేట వద్ద చెక్‌పోస్టులు ఉన్నాయని, ప్రతి చెక్‌పోస్టును క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామని అన్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడితే ఊరుకునేదిలేదని చెప్పారు. సిబ్బంది కొరత ఉందని, దొడ్డిదారిన ఉత్పత్తులు తరలింపును ఆరికట్టేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment