
ఏపీఐఐసీ అధికారుల దౌర్జన్యం
నక్కపల్లి: డీ ఫారం రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా ఏపీఐఐసీ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించి రైతుల భూముల్లో రోడ్డు పనులు ప్రారంభించడాన్ని అఖిలపక్ష నాయకులు శనివారం అడ్డుకున్నారు. డి.ఎల్.పురంలో పోలీసులకు.. రైతులకు, అఖిలపక్ష నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలంటూ రైతులు యంత్రాలకు అడ్డంగా నిలబడి పనులు అడ్డుకున్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, స్థానిక సర్పంచ్ కిల్లాడ కృష్ణ తదితరులు మాట్లాడుతూ డి.ఎల్.పురంలో సర్వే నెంబరు 193, 194, 195, 196, 197, 198, 199లలో సుమారు 64 ఎకరాల ప్రభుత్వ భూమిని 1967లో గ్రామానికి చెందిన పేదలకు డీ ఫారం పట్టాలుగా మంజూరు చేశారన్నారు. అప్పటి నుంచి రైతులంతా మధ్య భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. ఇటీవల ఇండస్ట్రియల్ కారిడార్ కోసం, బల్క్‌డ్రగ్ పార్క్ కోసం భూములు సేకరించిన ప్రభుత్వం జిరాయితీ రైతులకు నష్టపరిహారం చెల్లించి డీ ఫారం రైతులకు ఇవ్వలేదన్నారు. తాజాగా ఏపీఐఐసీ పనులు దక్కించుకున్న కాంట్రాక్టరు రైతులకు తెలియకుండా డీ ఫారం భూముల్లో బుల్‌డోజర్లు, జేసీబీల సాయంతో అక్రమంగా ప్రవేశించి చదును చేసి రోడ్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకున్న రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారన్నారు. విషయం తెలిసి తాము ఇక్కడకు వచ్చి రైతుల పక్షాన ప్రశ్నిస్తే తమపై కూడా దౌర్జన్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతులకు చెందిన భూములను బలవంతంగా లాక్కోవడమే కాకుండా నష్టపరిహారం చెల్లించకుండా రోడ్డు పనులు ప్రారంభించడం తగదన్నారు.
ఇరు పక్షాల వాదోపవాదాలు
ఈ సందర్భంగా పోలీసులకు, అఖిలపక్ష నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. నష్టపరిహారం చె ల్లించేవరకు పనులు ప్రారంభించడానికి వీల్లేదని అఖిలపక్ష నాయకులు పట్టుబట్టారు. ఎస్‌ఐ కుమారస్వామి పనులు జరిగే ప్రాంతానికి వచ్చి రైతులు, ఆందోళనకారులతో చర్చలు జరిపారు. పరిహారం కోసం అఽధికారులను కలవాలని, అంతే తప్ప పను లు అడ్డుకోవడం తగదని సూచించారు. రైతులు బదులిస్తూ పనులు అడ్డుకోకపోతే నష్టపరిహారం చెల్లించే అవకాశం లేదని వివరించారు. 2013 భూసేకరణ చట్టానికి ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. నోటిఫికేషన్ సమయంలో ఒకలా భూసేకరణ సమయంలో మరోలా వ్యవహరించి రైతులను మోసం చేసిందని అప్పలరాజు ఆరోపించారు. తక్షణమే డీ ఫారం భూములు కలిగిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, కాని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.
పరిహారం ఇవ్వకుండా రోడ్డు పనులు
డి.ఎల్.పురంలో అడ్డగించిన రైతులు
పోలీసుల మోహరింపు..రైతులతో వాగ్వాదం

ఏపీఐఐసీ అధికారుల దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment