
అనంతపురం: మండలంలోని కళేకుర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు జయరాములు తమకొద్దంటూ గ్రామస్తులు మూకుమ్ముడిగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్జీని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భాస్కరరెడ్డి, ఉప సర్పంచ్ బోయ రామిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు మారెన్న మాట్లాడుతూ... వేసవి సెలవులకు ముందు కొందరు విద్యార్థినిల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించాడని గుర్తు చేశారు.
ఆ సమయంలో1098కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఒక్కసారికి తనను క్షమించి వదిలేయండని, మరోసారి ఎలాంటి తప్పు చేయనని, సాధారణ బదిలీల్లో ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ జయరాములు ప్రాధేయపడడంతో అందరూ మౌనంగా ఉండిపోయామన్నారు. అయితే ఆయన బదిలీపై వెళ్లకుండా పాఠశాల పునఃప్రారంభం రోజున రావడంతో విద్యార్థినిలు బడికి వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించకపోతే పాఠశాల ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.