
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మడకశిర మండలంలోని మెళవాయి సమీపంలో రెండు రోజుల క్రితం (బుధవారం) ఒక ఆడ చిరుత మృతి చెందింది. గురువారం కూడా అదే ప్రాంతంలోనే మరో మగ చిరుత విగతజీవిగా కనిపించింది. రెండు చిరుతలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాయి. కారణాలు అంతుచిక్కడం లేదు. విషాహారం తినడంతో మృతి చెందాయా? అనారోగ్యం బారిన పడి మృతి చెందాయా? లేదా వేటగాళ్ల దాడిలో మృతి చెందాయా? అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.
తల్లీపిల్లని అనుమానం..
మృతి చెందిన రెండు చిరుతలు తల్లి, పిల్లగా అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. బుధవారం మృతి చెందిన ఆడ చిరుతకు దాదాపు 32 నెలల వయసు ఉంటుందని చెబుతున్నారు. గురువారం మృతి చెందిన మగ చిరుతకు 18 నెలల వయసు ఉంటుందంటున్నారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన చిరుతలు తల్లి, పిల్లగా భావిస్తున్నారు. మగ చిరుతకు ఇంకా పాల పళ్లు అలాగే ఉన్నట్లు తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం..
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వరుసగా చిరుత పులులు మృత్యవాత పడుతుండటం విస్మయం కలిగిస్తోంది. మడకశిర నియోజకవర్గంలో రెండు రోజుల్లోనే రెండు చిరుతలు మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సరిగ్గా ఏడాదిన్నర క్రితం కూడా పెనుకొండ నియోజకవర్గంలో రెండు చిరుతలు మృతి చెందాయి. ఆరు నెలల క్రితం బెంగుళూరు జాతీయ రహదారిపై సోమందే పల్లి వద్ద వాహనం ఢీకొనడంతో ఒకటి ప్రాణాలు కోల్పోయింది. వరుసగా ఇలా అరుదైన వన్య సంపదను నష్టపోతుండడంతో ఫారెస్టు అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది.
కాటేస్తున్న కాలం!
సాధారణంగా చిరుతకు పరిధి ఉంటుంది. ఆ ప్రాంతంలోకి మరొక చిరుతను రానివ్వదు. అయితే, ఆగస్ట్ నుంచి నవంబర్ మాసాల మధ్య కాలంలో కలయిక కోసం అవి పరిధి దాటుతూ ఉంటాయి. ఈ సమయంలోనే వాటి మధ్య తీవ్ర ఘర్షణ జరుగు తుంది. ఒక్కోసారి ఆడ, మగ చిరుతలు కూడా ఘర్షణ పడుతూ ఉంటాయి. ఈ కారణంగా చిరుతలు ప్రాణాలు కోల్పోతాయని అధికారుల చెబుతున్నారు. ఒక్కోసారి బలమైన దుప్పులను వేటాడుతున్నప్పుడు వాటి కొమ్ములు తగిలి గాయాలపాలై కన్నుమూస్తామని పేర్కొంటున్నారు. మరోవైపు చిరుతలు రాత్రిళ్లలో రహదారులపైకి వచ్చినప్పుడు వాహనాల హెడ్‌లైట్ ఫోకస్‌కు ఆగిన సమయంలో అవి ఢీకొట్టి చనిపోతున్నాయి.
చిరుతలకు అనుకూలంగా ఉమ్మడి జిల్లా ..
అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో చిరుతల సంతానోత్పత్తి బాగా జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. వీటితో పాటు జింకలు, నెమళ్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్టు ఫారెస్టు పరిశీలనలో వెల్లడైంది. రాయలసీమలోనే చిరుతలకు అనుకూలమైన ప్రాంతంగా ఉమ్మడి జిల్లా అడవులు పేరుపొందాయి. దీంతో వన్యప్రాణుల సంతతి పెరుగుతోందని భావిస్తున్న తరుణంలో ఒక్కో వన్యమృగం మృతి చెందుతూ ఉండడం కలవరం కలిగిస్తోంది.
విషం ఆనవాళ్లు..
మృతి చెందిన రెండు చిరుతలకు మడకశిరలోని వెటర్నరీ ఆస్పత్రిలో డాక్టర్లు పోస్ట్‌మార్టం నిర్వహించారు. రెండు చిరుతల శరీరంలో విషం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ చిరుతలకు శరీరంపై ఎలాంటి గాయాలు కూడా లేవు. అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని డాక్టర్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో విషాహారం తినడంతోనే చిరుతలు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. అయితే పూర్తిస్థాయిలో చిరుతల మృతిని నిర్ధారించడానికి వాటి శరీర నమూనాలను బెంగళూరు ల్యాబ్‌కు పంపారు.
చిరుతలు పరిధి దాటే కాలమిది
సాధారణంగా నైరుతి రుతుపవనాల కాలంలో చిరుతలు ఒకదానితో ఒకటి కలుస్తుంటాయి. దీని కోసం తమ పరిధి దాటి వెళతాయి. ఈ క్రమంలో వేరొక చిరుతతో బాగా గొడవ పడి వాటికవే శత్రువులుగా మారి చంపేసుకుంటాయి. అందుకే ఈ సమయంలో అటవీ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలను అడవుల్లోకి వెళ్లకూడదని హెచ్చరిస్తుంటాం. – సందీప్ కృపాకర్,జిల్లా ఫారెస్టు అధికారి, అనంతపురం
బెంగుళూరు లేబొరేటరీకి నమూనాలు
మృతిచెందిన రెండు చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించాం. రెండింటి శరీరాలపై ఎలాంటి గాయాలూ లేవు. అందుకే నమూనాలు బెంగుళూరులోని వెటర్నరీ లేబొరేటరీకి పంపిస్తున్నాం. ఆ ప్రక్రియ పూర్తయితే గానీ మృతికి కారణమేమనేది చెప్పలేం.
–డా.అమర్, పశువైద్యాధికారి, మడకశిర
Comments
Please login to add a commentAdd a comment