అనంతపురం: ఓ చికెన్ సెంటరులోకి కొండచిలువ ప్రవేశించడంతో కలకలం రేగింది. ఈ ఘటన సోమవారం పుట్టపర్తి మండల పరిధిలో జరిగింది. స్థానిక ఎనుములపల్లి చెరువు సమీపాన చిత్రావతి బైపాస్ రోడ్డుకు ఆనుకుని ముక్తార్ అనే వ్యక్తి చికెన్ సెంటరు నిర్వహిస్తున్నాడు. వెనుక ఉన్న కొండలో నుంచి ఆదివారం రాత్రి కొండ చిలువ చికెన్ సెంటరులోకి ప్రవేశించింది.
నాలుగు బ్రాయిలర్ కోళ్లను తినేసిన తర్వాత నీటి డ్రమ్ములోకి చేరుకుంది. సోమవారం ఉదయం ముక్తార్ నీటి కోసం డ్రమ్ము వద్దకు వెళ్లగా..కొండ చిలువ కన్పించింది. దాదాపు తొమ్మిది అడుగుల పొడవు ఉంది. భయభ్రాంతులకు గురైన అతను చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు కూడా భయంతో పరుగులు తీశారు. చివరకు పుట్టపర్తికి చెందిన స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇవ్వడంతో అతను అక్కడికి చేరుకుని కొండచిలువను చాకచక్యంగా పట్టుకున్నాడు. తర్వాత అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment