సర్కారు అన్యాయంపై ఆగ్రహం
అనంతపురం: కూటమి ప్రభుత్వ అన్యాయపూరిత చర్యలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లోకాయుక్త, హెచ్‌ఆర్సీ, నల్సార్ వర్సిటీని అమరావతికి తరలించాలన్న సర్కారు నిర్ణయంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కోర్టులో బుధవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. సీనియర్ న్యాయవాదులు ఎంసీ సంపత్‌కుమార్, బీజే రవికుమార్, జి. ఉమాపతి, నాగన్న, వెంకట్రాముడు, శ్రీనివాస్ రెడ్డి, హనుమన్న, రంగనాయకులు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకు నిరవధికంగా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒడంబడిక అమలు చేసి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. దశాబ్ధాలుగా రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా జగన్నాథ గట్టుపై నిర్మిస్తున్న నల్సార్ వర్సిటీని సైతం అమరావతికి తరలించే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ 2014–19 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న బీజేపీ.. నేడు మౌనంగా ఉండడం సరికాదని విమర్శించారు. కాగా... ఎయిమ్స్‌ను సైతం అనంతపురంలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ తీర్మానించింది. గురువారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.
కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సిందేనని డిమాండ్
జిల్లా కోర్టులో విధుల బహిష్కరణ
Comments
Please login to add a commentAdd a comment