కాసుల వేట.. అవస్థల మేట
అడ్డుగోలుగా ఫీజులు
కార్పొరేట్ కళాశాలలకు ఒకచోట అనుమతులు తీసుకుని అక్రమంగా బ్రాంచ్‌లు ఏర్పాటు చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ఫీజులు మాత్రం అడ్డుగోలుగా వసూలు చేస్తున్నారు. కరువుకు నిలయంగా మారిన అనంతపురం జిల్లా గురించి దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. అయినా కళాశాలల యాజమాన్యాలు కనికరం లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయి.
– కాశీ మనోజ్, వైఎస్సార్‌సీపీ ఎస్‌యూ
తాడిపత్రి నియోజకవర్గ అధ్యక్షులు
మంత్రి లోకేష్ స్పందించాలి
ట్వీట్లు, వాట్సాప్ మెసేజ్‌లకు స్పందిస్తానంటున్న విద్యాశాఖ మంత్రి లోకేష్ గారూ... జిల్లాలో మీ సహచర మంత్రి నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి బలన్మరణం పొందాడు. ముందు ఈ చావుపై స్పందించండి. నారాయణ విద్యా సంస్థల విచ్చలవిడి ఫీజుల దోపిడీపై, ధనార్జనే ధ్యేయంగా నడస్తున్న విద్యా సంస్థలపై మాట్లాడండి.
– నరేష్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధానకార్యదర్శి
బయటకు సమాచారం రానివ్వడం లేదు
నగర శివారులోని నారాయణ జూనియర్ కళాశాల బాలికల వసతి గృహంలో ఇటీవల నీళ్లు లేక దాదాపు 20 రోజుల పాటు వేలాదిమంది విద్యార్థినులు స్నానాలు కూడా చేయలేదు. విషయం బయటకు పొక్కనీయకుండా అందుబాటులో ఉండే ఫోన్లన్నీ బంద్ చేశారు. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేసి సమస్య పరిష్కారమయ్యేలా చేశాయి.
– సురేష్‌యాదవ్, బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి
● కార్పొరేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యం
● ఆకర్షణీయమైన పేర్లతో తల్లిదండ్రులకు బురిడీ
● రూ. లక్షలు వసూలు చేస్తున్నా వసతుల లేమి
●అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ‘కో–సూపర్‌చైనా’ బ్యాచ్ జేఈఈ అడ్వాన్స్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేస్తున్నారు. అలాగే ‘ఎన్–120’ బ్యాచ్‌కు రూ. 1.80 లక్షలు, ‘సూపర్ చైనా’ నీట్ బ్యాచ్‌కు రూ.1.70 లక్షలు, ‘కో–స్పార్క్’ బ్యాచ్‌కు రూ. 1.50 లక్షలు, ‘జెఎఫ్‌టీబీ’ బ్యాచ్‌కు రూ. 1.30 లక్షలు, ‘ఎన్–40’ బ్యాచ్‌కు రూ.1.30 లక్షలు లాగుతున్నారు. ఫీజుల పట్టికను కళాశాలల్లోనే బహిరంగంగా ప్రదర్శనకు ఉంచారు. తల్లిదండ్రులు ఎవరు వెళ్లిన తమ విద్యా సంస్థల్లో అమలు చేస్తున్న గ్రూపులు, వాటి ఫీజు ధరలు
అంటూ కరపత్రాలు చేతిలో పెడుతున్నారు. శ్రీచైతన్య జూనియర్ కళాశాలల్లోనూ ఐసీ, ఐకాన్, ఐపీఎల్, ఎంపీఎల్ పేర్లతో ఫీజుల దోపిడీ చేస్తున్నారు.
అనంతపురం ఎడ్యుకేషన్: కార్పొరేట్ విద్యా సంస్థలు మాయ చేస్తున్నాయి. ఒకప్పుడు రూ. 20 వేలు, రూ. 30 వేల ఫీజులు ఉన్న కార్పొరేట్ జూనియర్ కళాశాలల్లో నేడు ఏ గ్రూపు తీసుకున్నా లక్షలాది రూపాయలు ఫిక్స్ చేశారు. రాష్ట్రంలో ఉన్న వివిధ బ్రాంచ్‌ల్లో బాగా వచ్చిన మార్కులు, ర్యాంకులను పట్టుకుని ఇక్కడ ప్రచారం చేసు కుంటూ తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తున్నారు.
విద్యార్థులను కుక్కేస్తూ..
లక్షల్లో ఫీజు వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు ఆశించిన స్థాయిలో వసతులు మాత్రం కల్పించడం లేదు. ఇటీవల విద్యార్థి చరణ్ ఆత్మహత్యకు పాల్పడిన నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో దాదాపు 2 వేలమంది విద్యార్థులు చదువుకుంటున్నట్లు తెలిసింది. ఆ స్థాయిలో గదులు, మరుగుదొడ్లు, బాత్రూమ్‌లు మాత్రం లేవు. హాస్టల్‌లో ఒక్కో గదిలో కనీసం ఆరుగురు విద్యార్థులుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే అగ్గిపెట్టెల్లాంటి గదుల్లో 12–14 మంది విద్యార్థులను కుక్కుతున్నారు. హాస్టల్‌కు వస్తే బెడ్డుమీద గడపాలి తప్ప కింద కాళ్లు పెట్టే పరిస్థితి కూడా ఉండడం లేదని చెబుతున్నారు.మరుగుదొడ్లు తరచూ శుభ్రం చేయని కారణంగా విద్యార్థులు చర్మవ్యాధుల బారిన పడుతున్నారు.
నీటికోసం విలవిల..
ఇటీవల నారాయణ బాలికల జూనియర్ కళాశాలలో నీరు సరఫరా కాక బాలికలు విలవిల్లాడారు. మూడు రోజులకోసారి మాత్రమే స్నానం చేయాలనే నిబంధన విధించారు. దాదాపు 10 రోజులు భరించిన విద్యార్థులు తర్వాత సాధ్యం కాక.. తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి విన్నవించినా మార్పు రాలేదు.ఈ క్రమంలోనే విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట వరుస ఆందోళనలు చేయగా.. దాదాపు 25 రోజుల తర్వాత సమస్య పరిష్కారమైందంటే విద్యార్థుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అరం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment