వీడ్కోలుకు ‘రాంరాం’
అనంతపురం అర్బన్: జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరళ విజయకుమారి శుక్రవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్డ్ అవుతుంటే... ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సహచరులు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. అయితే ఖజానాశాఖ డీడీ విషయంలో ఇందుకు భిన్నంగా పరిస్థితి నెలకొనడం చర్చనీయాంశమైంది. ఆ శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు పెనుబోలు శంకర్ పేరిట ఒక మెసేజ్ ఉద్యోగుల వాట్సాప్ గ్రూపులో వైరల్ అవుతోంది. ‘‘బ్రిటీష్ పరిపాలన కాలంలో మాదిరి నలిగిపోయిన ట్రెజరీ ఉద్యోగులు 31వ తేదీ నాటికి విముక్తులవుతున్నారు. ఉద్యోగులను బానిసల్లాగా చూసిన ఈ డీడీ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ.. ఆమె పదవీ విరమణ కార్యక్రమాన్ని మనమంతా బహిష్కరిస్తున్నాం. జిల్లా ఆఫీసు నందు అధికారులు కానీ, ఉద్యోగులు కానీ దయచేసి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించకూడదని ప్రార్థిస్తున్నా. కాదని చేసేందుకు ముందుకు వచ్చిన వారు జరగబోవు ఇబ్బందులకు బాధ్యులు, బాధితులు కాకూడదని నా ప్రార్థన’’ అంటూ ఉన్న ఆ మెసేజ్ ఖజానా శాఖలో కలకం రేపింది. కాగా, సరళ విజయకుమారి పదవీ విరమణ నేపథ్యంలో వైఎస్సార్ జిల్లా ఖజానా శాఖ డీడీ వెంకటేశ్వర్లను జిల్లా ఖజానా శాఖ ఇన్చార్జ్ డీడీగా ప్రభుత్వం నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment