![నారాయణ విద్యా సంస్థను సీజ్ చేయాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30atpc71a-110011_mr-1738265439-0.jpg.webp?itok=OPbRrxgv)
నారాయణ విద్యా సంస్థను సీజ్ చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన నారాయణ విద్యా సంస్థను సీజ్ చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం ఎదుట కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ఇంటర్‌బోర్డు అధికారులు కానీ, పోలీసు అధికారులు కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. నారాయణ కళాశాల ఎదుట ఆందోళన చేస్తే అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు. ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి నాయకులపైనేమో కేసులు.. విద్యార్థి చావుకు కారణమైన కళాశాల యాజమాన్యం ఏసీ గదుల్లోనా? అని దుయ్యబట్టారు. జిల్లా పోలీసులపై తమకు అపార నమ్మకం ఉందన్నారు. అయితే, విద్యార్థి బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు రాకనే రక్తపు మరకలు తొలగించారని, ఫీజు కోసం ఒత్తిడి చేశారని స్వయంగా తండ్రి చెప్పినా, విద్యార్థి సంఘాల నాయకులు డీఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయకపోవడంపై అనుమానాలు కల్గుతున్నాయన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కళాశాల యాజమాన్యంపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాసుల కోసం కక్కుర్తిపడుతున్న ఇంటర్ బోర్డు ఆర్‌ఐఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ ట్విట్టర్ల శాఖకు మంత్రి కాదని, ఆయన విద్యాశాఖ మంత్రి అనే విషయం మరిచిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏదైనా సంఘటన జరిగితే సోషల్ మీడియాలో కాకుండా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నారాయణ విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ శుక్రవారం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి నాయకులు ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు,ప్రధానకార్యదర్శి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల డిమాండ్
నేడు విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
Comments
Please login to add a commentAdd a comment