అనంతపురం: సమాజానికి ఉపయోగపడే రీల్స్, పోస్ట్‌లు, కథనాలు, స్టేటస్ వీడియోలను రూపొందించాలని సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లూయెన్సర్లకు ఎస్పీ జగదీశ్ పిలుపునిచ్చారు. స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే దిశగా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. సైబర్ నేరగాళ్ల ఆట కట్టడి చేసేలా చైతన్యం తీసుకురావాలని కోరారు. రోడ్డు ప్రమాదాలతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి చిన్నాభిన్నమవుతున్నాయని, ఎంతో మంది మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో పత్రికలు, టీవీలతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ విస్తృత ప్రచారం అవసరమని భావించామన్నారు. యూట్యూబర్లు సామాజిక బాధ్యతగా భావించి వీడియోలు రూపొందించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల కట్టడి, ప్రమాదాలు జరిగిన వెంటనే గంటలోపు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగంతో జీవితాలు ఎలా నాశనమవుతాయో యువతకు చేరేలా ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం డిస్కవర్ అనంతపురం వారు తయారు చేసిన యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమణమూర్తి, డీఎస్పీ శ్రీనివాసరావు, సైబర్ సెల్ సీఐ షేక్ జాకీర్, కోర్టు మానిటరింగ్ సెల్ సీఐ వెంకటేశ్ నాయక్ సహా 150 మంది యూట్యూబర్లు పాల్గొన్నారు.
ఎస్పీ జగదీశ్ పిలుపు
Comments
Please login to add a commentAdd a comment