● పౌల్ట్రీ ఫారాలను సందర్శించిన పశు సంవర్ధక శాఖ అధికారులు
అనంతపురం అగ్రికల్చర్: పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో కోళ్ల అసాధారణ మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు పశుసంవర్ధకశాఖ రెండు జిల్లాల జేడీలు డాక్టర్ జీపీ వెంకటస్వామి, డాక్టర్ జి.శుభదాస్, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ డాక్టర్ ఎన్.రామచంద్ర గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర పశుసంవర్ధకశాఖ అధికారుల ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో పలు ప్రాంతాల్లో పౌల్ట్రీ ఫారాలు సందర్శించి కోళ్ల ఆరోగ్య స్థితిగతులు తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అలాంటి మరణాలు సంభవిస్తున్న దాఖలాలు లేవన్నారు. అనుమానిత ప్రాంతాలు, అవసరమైన చోట కోళ్ల నుంచి నమూనాలు సేకరిస్తున్నామన్నారు. ఎక్కడైనా అలాంటి అసాధారణ పరిస్థితులు ఉన్నట్లు గమనిస్తే వెంటనే పశువైద్యులను సంప్రదించాలని సూచించారు. చనిపోయిన కోళ్లను ఖాళీ స్థలాలు, బావులు, వాగులు, రోడ్డు పక్కన పడేయకూడదని, కచ్చితంగా గుంత తీసి పాతిపెట్టి పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. అపోహలకు పోకుండా బాగా ఉడికించిన గుడ్లు, మాంసం తీసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment