![ప్రాణం పోతున్నా పట్టదా?](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/01st_mr-1738872141-0.jpg.webp?itok=zPL7aoPq)
ప్రాణం పోతున్నా పట్టదా?
8 నెలల్లోనే 190 మందికి పైగా మృతి
వైద్యుల తీరుపై తీవ్ర విమర్శలు
అవగాహన కల్పించడంలో వైద్యారోగ్య శాఖ విఫలం
మంత్రి సత్యకుమార్ ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రయోజనం శూన్యం
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రి లోని ఎస్‌ఎన్‌సీయూ(స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్)లో పసికందులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలసిపోతుండడం కలవరపెడుతోంది. నెలలు నిండకనే ప్రసవం, తల్లికి సమస్యలుండటం, పౌష్టికాహార లోపం, వైద్యుల అలసత్వం తదితర కారణాలతో గత 8 నెలల్లోనే 190 పైకిగా మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి అనంతపురం జిల్లావాసులకు అనంతపురం సర్వజనాస్పత్రి పెద్దదిక్కు. ఉమ్మడి జిల్లాలోని ధర్మవరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సత్యకుమార్ రాష్ట్ర వైద్య ఆరోగశాఖ మంత్రి ఉన్నారు. తన ఇలాకాలోని పెద్దాస్పత్రిలోనే మృత్యువు విలయతాండవం చేస్తున్నా ఆయన పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అవగాహన కల్పించడంలో విఫలం..
మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే, అవగాహన లేక పౌష్టికాహారం తీసుకోకపోవడం, క్రమం తప్పక పరీక్షలు చేసుకోకపోవడం, గతంలో సమస్య ఉన్నా వాటిని గుర్తించకపోవడం తదితర కారణాలతో నెలలు నిండకనే బిడ్డలకు జన్మనిస్తున్నారు. ఐసీడీఎస్ అంగన్‌వాడీ కేంద్రాలు, ఆరోగ్యశాఖ సిబ్బంది తల్లుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చేలా తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకు రావాల్సి ఉన్నా క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి కన్పించడం లేదు. ఆరోగ్య శాఖకు చెందిన మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు, ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తలు, హెల్త్ ఎడ్యుకేటర్ల బాధ్యతారాహిత్యం పిల్లల ప్రాణాల మీదకు తెస్తోంది.
వైద్యుల నిర్లక్ష్యం..
ఇదంతా ఒక ఎత్తయితే సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూపై వైద్యులు ప్రత్యేక దృష్టి అలసత్వం కూడా పసికందుల మరణాలకు దారితీస్తోందనే విమర్శలున్నాయి. గత 8 నెలల్లోనే 190 మందికి పైగా మరణించిన నేపథ్యంలో ఆస్పత్రి ఉన్నాధికారులు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంది. కానీ, సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ భ్రమరాంబ దేవి ఏనాడూ ఎస్‌ఎన్‌సీయూను తనిఖీ చేసిన పాపాన పోలేదు. ఈ క్రమంలో ఎస్‌ఎన్‌సీయూ వైద్యులు పత్తా లేకుండా పోతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు.
సమస్యలెన్నో..
ఆరోగ్యవంతమైన శిశువు 2.5 కేజీలు, ఆపై బరువు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే శ్వాసకోశ, సెప్సిస్, గుండె సమస్యలతో పాటు పలు అంటురోగాలు తలెత్తుతాయి. సర్వజనాస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలో అడ్మిషన్ పొందే పసికందుల్లో 50 నుంచి 60 శాతం తక్కువ బరువు, వివిధ రకాల రోగాలతో బాధపడుతున్న వారు ఉంటున్నారు.
కలెక్టర్ స్పందిస్తేనే..
జిల్లా కలెక్టర్‌గా ఉన్న డాక్టర్ వినోద్‌కుమార్‌కు వైద్య రంగంపై అపార అనుభవం ఉంది. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఆయన ఎన్నో చర్యలు తీసుకుని రాష్ట్రస్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఈ క్రమంలో అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప పరిస్థితులు దారికొచ్చేలా లేవు.
![ప్రాణం పోతున్నా పట్టదా?1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/07022025-atd_tab-01_subgroupimage_1885650288_mr-1738872142-1.jpg)
ప్రాణం పోతున్నా పట్టదా?
Comments
Please login to add a commentAdd a comment