
రాజమండ్రిలో 15 మంది వలంటీర్లు రాజీనామా
ఇటీవల వేధింపులు ఎక్కువ అయ్యాయని ఆవేదన
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న తమను టీడీపీ, జనసేన నాయకులు వేధిస్తుండడంతో రాజీనామా చేస్తున్నట్లు రాజమహేంద్రవరం నగరానికి చెందిన 15 మంది వలంటీర్లు చెప్పారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు వారి రాజీనామాలను అందజేశారు. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం 1వ డివిజన్ 2వ సచివాలయానికి చెందిన ఒకరు, 48వ డివిజన్ 89వ సచివాలయానికి డివిజన్‌కు చెందిన ఐదుగురు, 90వ సచివాలయానికి చెందిన తొమ్మిది మంది వలంటీర్లు రాజీనామాలను అడ్మిన్ సెక్రటరీలకు అందజేశారు.
ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవచేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరువ అయ్యేటట్టు చూస్తున్నామన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో విధినిర్వహణ సమయంలో టీడీపీ, జనసేన నాయకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మిత్రులు, బంధువులతో మాట్లాడినా అనుమానంగా చూస్తున్నారని, ఇది భరించలేకపోతున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వలంటీర్లుగా కొనసాగలేమని చెప్పారు. ఈ విషయమై నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సత్యవేణి స్పందిస్తూ.. 15 మంది వలంటీర్ల రాజీనామాలు అందాయన్నారు. వాటిపై కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment