ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్యరంగ అనుబంధ కోర్సులు | Acharya Prasada Reddy: Medical Associate Courses in Andhra University | Sakshi
Sakshi News home page

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్యరంగ అనుబంధ కోర్సులు

Published Fri, Sep 29 2023 5:27 AM | Last Updated on Fri, Sep 29 2023 5:27 AM

Acharya Prasada Reddy: Medical Associate Courses in Andhra University - Sakshi

ప్రదర్శనను తిలకిస్తున్న వీసీ ప్రసాదరెడ్డి, డాక్టర్‌ అబ్రహం తదితరులు

ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్య రంగానికి అనుబంధంగా కొత్త కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ విభాగం, నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ అప్లికేషన్‌ ఆఫ్‌ రేడియో ఐసోటోప్స్‌ అండ్‌ రేడియేషన్‌ ఇన్‌ ఇండస్ట్రీ(నారీ) సంయుక్త ఆధ్వర్యాన గురువారం బీచ్‌రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్‌లో ‘రీసెంట్‌ ట్రెండ్స్‌ ఆన్‌ ఆప్లికేషన్స్‌ ఆఫ్‌ రేడియో ఐసోటోప్స్‌ అండ్‌ రేడియేషన్‌ టెక్నాలజీస్‌’ అంశంపై సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఉన్నత విద్యాసంస్థలు అన్ని అంశాల్లోనూ భాగస్వాములుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 98 ఏళ్ల ప్రస్థానం కలిగిన ఆంధ్ర వి«శ్వవిద్యాలయంలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏయూ ఫార్మసీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, సైకాలజీ వంటి మెడికల్‌ సంబంధిత కోర్సులను అందిస్తోందని చెప్పారు.

ప్రస్తుతం అనేక రంగాల్లో రేడియేషన్‌ టెక్నాలజీ పాత్ర పెరుగుతోందని, ఈ రంగంలో ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునేందుకు యువ పరిశోధకులు కృషి చేయాలన్నారు. డాక్టర్‌ అబ్రహాం వర్గీస్‌ మాట్లాడుతూ రేడియేషన్‌ టెక్నాలజీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్ని రంగాలు, పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువ పరి«శోధకులు, ఆచార్యులు నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు.

అనంతరం వీసీ ప్రసాదరెడ్డి, ‘నారీ’ ప్రధాన కార్యదర్శి పీజే చాండీ, డాక్టర్‌ అబ్రహాం తదితరులు సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. రేడియేషన్‌ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలతో కూడిన ఎగ్జిబిషన్‌ను అతిథులు, విద్యార్థులు తిలకించారు. బ్రిట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రదీప్‌ ముఖర్జి, ఏయూ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్య కె.శ్రీని, సదస్సు చైర్మన్‌ ఆచార్య దుర్గాప్రసాద్, న్యూక్లియర్‌ ఫిజిక్స్‌ విభాగాధిపతి ఆచార్య లక్ష్మీనారాయణ, జాతీయ స్థాయిలో వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement