సాక్షి, అమరావతి: విదేశీయులు మన దేశంలో కంపెనీలు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మన రాష్ట్రం నుంచి ఎంతో మంది దేశ, విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేదు. జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు ఎక్కడైనా అర్హత ఉన్న ఎవరైనా చట్టం, నిబంధనల మేరకు ఏదైనా చేయవచ్చు. దీనిని విశ్యవ్యాప్తంగా ఎవరూ కాదనరు. కానీ ఈనాడుకు మాత్రం సీఎం సొంత జిల్లా వారు ఎలాంటి వ్యాపారాలు చేయకూడదని, టెండర్లు దక్కించుకోకూడదన్న అభిప్రాయం నరనరానా జీర్ణించుకుపోయింది. అందుకే వారు వ్యాపారాలకు అనర్హులనేలా కథనాలు అల్లుతోంది.
పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చ డానికి సీలేరులో రెండు అదనపు విద్యుత్ ఉత్పత్తి యూనిట్ల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) టెండర్లు పిలిచింది. అత్యంత పారదర్శకంగా బిడ్లు ఆహ్వానించి, రివర్స్ టెండరింగ్ ద్వారా టెండరు ఖరారు చేసింది. కానీ ఇదంతా తప్పన్నట్టు ‘ఈనాడు’ శుక్రవారం ఓ తప్పుడు కథనాన్ని ప్రచురించింది.
ఆ పత్రిక అధినేత రామోజీరావు పచ్చళ్లు అమ్ముకోవచ్చు.. పత్రికనూ నడుపుకోవచ్చు.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి మాత్రం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు టెండర్ ఇవ్వకూడదు. వారికి, వారు కొమ్ముకాస్తున్న వారికి ఒక న్యాయం.. సీఎం సొంత జిల్లా వారైతే మరో న్యాయం.. ఇదేం రామోజీ జర్నలిజం. ఏపీ జెన్‌కో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ టెండర్లలో వాస్తవాలు అంశాల వారీగా ఇలా ఉన్నాయి.
ఆరోపణ: వైఎస్సార్ జిల్లాకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టింది. ఈ సంస్థ వైఎస్సార్ జిల్లాకు చెందిన వ్యక్తికి సంబంధించినది కావడమే దానికి ఉన్న ఏకైక అర్హత.
వాస్తవం: ఏపీ జెన్‌కో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రివర్స్ టెండరింగ్ ద్వారానే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఈ కాంట్రాక్టును కైవసం చేసుకుంది. ఇందులో ఏపీ జెన్‌కో, ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదు. ఈ కన్సార్టియం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రతిష్టాత్మక బీహెచ్‌ఈఎల్‌తో ఈ ప్రాజక్టు యంత్ర పరికరాల సరఫరాకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రస్తుతం ఉన్న యూనిట్లకు కూడా బీహెచ్ఈఎల్ యంత్ర పరికరాలు సరఫరా చేసింది. కన్సార్టియంలోని మరో కంపెనీ పీఈఎస్‌కు ఇదివరకే ఈ ప్రాజక్టులో సివిల్ పనులు చేసిన అనుభవముంది. ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకుని, కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేసింది. ఈ ప్రాజక్టు పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2024కల్లా పూర్తవుతాయి.
ఆరోపణ: దిగువ సీలేరులో రెండు అదనపు యూనిట్ల నిర్మాణానికి అయ్యే వ్యయం, జీఎస్టీ, ఆలస్యానికి అయ్యే వడ్డీతో కలిపి రూ. 571 కోట్ల రుణాన్ని గ్రామీణ విద్యుత్ సంస్థ (ఆర్‌ఈసీ) నుంచి ప్రభుత్వం తీసుకుంది.
వాస్తవం: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ప్రాజెక్టుల నిర్మాణం కోసం రుణం తీసుకో వడం సర్వసాధారణం. ఇందులో తప్పేముంది?
ఆరోపణ: ఇప్పటికే షిర్డీ సాయి, దాని అనుబంధ సంస్థలకు రూ. 92 వేల కోట్ల విలువైన వివిధ విద్యుత్ ప్రాజెక్టులను ప్రభుత్వం కట్టబెట్టింది.
వాస్తవం: ఏపీ జెన్‌కోగానీ, డిస్కంలు గానీ నామినేషన్ పద్ధతిలో ఏ పనులూ ఎవరికీ కేటాయించలేదు. వివిధ ప్రాజెక్టుల కోసం పారదర్శకంగా టెండర్లు నిర్వహించాయి. అర్హతల మేరకు పోటీ బిడ్డింగ్‌లో పాల్గొని ఏ సంస్థ అయినా పనులు దక్కించుకోవచ్చు.
ఆరోపణ: ట్రాన్స్‌ఫార్మర్లు తయారు చేసే కంపెనీకి జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం కట్టబెట్టింది.
వాస్తవం: అంతర్జాతీయ పోటీ బిడ్డింగ్ (గ్లోబల్ టెండర్లు– ఇ ప్రొక్యూర్మెంట్ ప్లాట్‌ఫారం) ద్వారా ఏపీ జెన్‌కో టెండర్లు పిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జుడిషియల్ కమిషన్ కూడా సమీక్షించి ఈ ప్రాజెక్టు టెండర్లకు ఆమోదం తెలిపింది. రాఘవ ఎంటర్‌ప్రైజెస్, ఎన్‌సీసీ, పీఈఎస్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిపి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ జాయింట్ వెంచర్ సంస్థ బిడ్లు దాఖలు చేసింది.
టెండర్లలో కోట్ అయిన అతి తక్కువ మొత్తాన్ని గరిష్టంగా తీసుకుని ఏపీజెన్‌కో రివర్స్ టెండర్లు నిర్వహించింది. ఈ రివర్స్ టెండరింగ్‌లో షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ తక్కువ మొత్తానికి ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు ముందుకు వచ్చి కాంట్రాక్టు దక్కించుకుంది. రెండు దశల (సాంకేతిక, ఆర్ధిక) బిడ్డింగ్ ప్రాతిపదికన ప్రాజెక్టును అభివృద్ది చేసేందుకు సంస్థను ఎంపిక చేసింది. రివర్స్ టెండరింగ్ ప్రక్రియ వల్ల ఏపీ జెన్కోకు దాదాపు రూ.10 కోట్లు ఆదా అయ్యింది.
ఆరోపణ: ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణ, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతులు రాకముందే హడావుడి చేసింది.
వాస్తవం: విద్యుత్ కేంద్రం ప్రతిపాదనను ఏపీఈఆర్‌సీకి ముందే చెప్పారు. ప్రతిపాదనను పరిశీలించి డిస్కంలు, జెన్‌కో కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుని కమిషన్ అనుమతి కోసం అప్పుడు పంపాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఈ నెల 7న వచ్చింది. ఈ ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం రూ.1000 కోట్లు దాటనందున కేంద్ర విద్యుత్ ప్రాధికారిక సంస్థ (సీఈఏ) అనుమతి అవసరం లేదు.
ఆరోపణ: రెండు కొత్త యూనిట్లు నిర్మించడం వల్ల దిగువ సీలేరు ప్రాజెక్టు నుంచి అదనంగా ఒక్క యూనిట్ విద్యుత్ కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితి లేదు.
వాస్తవం: జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి మన గ్రిడ్ అవసరాలకు అనుగుణంగా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు 115 మెగావాట్ల యూనిట్లు ఏటా దాదాపు 1100 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తున్నాయి. దిగువ సీలేరు విద్యుత్ కేంద్రం మొట్టమొదట నిర్మించినప్పుడే ఆరు యూనిట్ల ఏర్పాటుకు కావలసిన ప్రధాన మౌలిక సదుపాయాలు కల్పించారు. దీంతో అదనంగా మరో రెండు 115 మెగావాట్ల యూనిట్లు నిర్మించాలని ఏపీ జెన్‌కో నిర్ణయించింది.
కొత్త యూనిట్లు నెలకొల్పడం వల్ల ఈ విద్యుత్ కేంద్రం గరిష్ట లోడ్ సామర్ధ్యం పెరుగుతుంది. దాంతో మార్కెట్ నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనవలసిన అవసరం తగ్గుతుంది. ప్రతి 115 మెగావాట్ల యంత్రం పీక్ డిమాండ్ సమయంలో సగటున 175 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయగలదు. దీనివల్ల డిస్కంలకు ఏటా 350 మిలియన్ యూనిట్లు విద్యుత్ మార్కెట్‌లో కొనాల్సిన అవసరం తగ్గి, ఆ మేరకు లాభం చేకూరుతుంది. పీక్ సమయాల్లో మార్కెట్ రేటు యూనిట్‌కు దాదాపు రూ.10 ఉంటోంది. సరాసరి పీక్ లోడ్ విద్యుత్ ధర రూ.8.0 అనుకున్నా ఈ రెండు యూనిట్ల వల్లా ఏటా దాదాపు రూ .280 కోట్లు ఆదా అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment