సాక్షి, అమరావతి: వెన్నంటి ఉండేవారిని సన్నిహితులంటారు. వదిలేసి వెళ్లిపోయిన వారిని సన్నిహితులని ఈనాడు రామోజీరావు మాత్రమే అనగలరు. న్యాయ సమీక్షను తప్పుబట్టగలరు. రివర్స్ టెండరింగ్ చెడ్డదని రాయగలరు. ఆయన అనుకున్నది సాధించడానికి ఏదైనా అచ్చేయగలరు. నిస్సిగ్గుగా అబద్ధాలను జనంపై రుద్దేయగలరు. అంతమాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియవనుకుంటే పొరపాటే.
అసలు ఈనాడు రామోజీరావు దృష్టిలో అవినీతి అంటే ఏమిటి? ఎక్కడా లేని రీతిలో రూ.2.28 లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో రాష్ట్ర ప్రజలకు అందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది అవినీతా? లేక గత ప్రభుత్వంలా దోచుకోవడం పంచుకోవడం అవినీతా? సీఎం స్థానంలో చంద్రబాబును కూర్చోబెట్టాలనే ఆరాటంలో పత్రిక విలువలను దిగజార్చి, జర్నలిజం నియమాలను తుంగలో తొక్కి, సొంత అజెండాతో కథనాలు రాయడం ఈనాడుకు నిత్యకృత్యమైంది. ఇదే ధోరణితో ఇంకా పూర్తి కాని భూగర్భ విద్యుత్ లైన్ల టెండర్లపై ఓ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఆ రాతల వెనుక అసలు నిజాలు ఇలా ఉన్నాయి..
ఆరోపణ: అది జగన్‌కు అత్యంత సన్నిహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ
వాస్తవం: పొంగులేటి శ్రీనివాసరెడ్డి సన్నిహితుడు అయితే వైఎస్సార్‌సీపీని ఎందుకు విడిచిపెట్టి వెళ్లారు? జగన్ మీద రాజకీయ ప్రతీకారంగా కేసులు పెట్టి, జైల్లోకి పంపిన కాంగ్రెస్‌లోకి ఎలా వెళ్తారు? ఏ రకంగా సన్నిహితుడని చెప్తారు? అసలు ఎవరు ఎవరికి సన్నిహితులో ఈనాడుకు తెలియంది కాదు.
రామోజీ వియ్యంకుడు నవయుగ వారికి చెందిన సంస్థ కాదా? ఆర్వీఆర్ అనే సంస్థ వారికి చెందిన వారిది కాదా? సుధాకర్ యాదవ్ యనమలకు వియ్యంకుడు కాదా? అందుకే పోలవరంలో నామినేషన్ పద్ధతుల్లో కాంట్రాక్టు దక్కలేదా? సీఎం రమేష్ మీవాడు కాదా? వారి సంస్థ రిత్విక్‌కు నామినేషన్ పద్ధతిలో పనులు కట్టబెట్టలేదా? నామా నాగేశ్వరరావు, గరికపాటి మోహన్‌రావు మీ వాళ్లు కాదా? రామోజీరావు ఓన్ చేసుకోవాలంటే వీళ్లని ఓన్ చేసుకోవాలి.
ఆరోపణ: ప్రభుత్వ పెద్దలకు సన్నిహిత సంస్థల్లో దేనికి ఏ కాంట్రాక్టు వెళ్లాలో ముందే ఖరారైపోతుంది.
వాస్తవం: రాష్ట్రంలోని జ్యుడిషియల్ ప్రివ్యూ వ్యవస్థ దేశానికే మార్గదర్శకంగా నిలుస్తోంది. ముందుగా టెండర్లు తీసుకుని 2 వారాల సమయం ఇచ్చి పబ్లిక్ డొమైన్‌లో వాటిని పెట్టి అభ్యంతరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ జడ్జి స్వీకరిస్తారు. ఆ మేరకు మార్పులు చేస్తారు. మళ్లీ టెండర్లు పిలుస్తారు. టెండర్లు ఖరారు చేశాక రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తారు. ఇంత పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ దేశంలో ఎక్కడాలేదు. మరి భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల టెండర్ల ప్రక్రియలో రామోజీరావు ఎందుకు పాల్గొనలేదు?
ఆరోపణ: టెండర్ నిబంధనలు ఎలా ఉండాలో అధికారులకు ఆయనే నిర్దేశిస్తారు.
వాస్తవం: ‘ఆర్‌డీఎస్‌ఎస్’ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) పరిధిలోని తుపాను ప్రభావిత తీర ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ పటిష్టత కోసం భూగర్భ విద్యుత్ కేబుళ్లు అమర్చాలని ప్రణాళిక రూపొందించారు.
రూ..1,165.41 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు నివేదికను 2022 మార్చిలో కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.699.25 కోట్లు గ్రాంట్ రూపంలో వస్తుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖకు చెందిన నోడల్ ఏజెన్సీ పీఎఫ్‌సీ ఆమోదించిన స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్‌కి అనుగుణంగా ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లు పిలిచారు. దీని నిబంధనలను ఎవరో ఒకరు మార్చేసే అవకాశం లేదు.
ఆరోపణ: పనులు అవే.. అంచనాలు పెంచేయడం వల్ల అదనంగా ఖర్చు
వాస్తవం: భూగర్భ విద్యుత్ పనుల్లో అధికంగా వినియోగించే కేబుల్స్ ధరల్లో భారీ వ్యత్యాసం కారణంగా టెండర్ ధర అధికంగా వచ్చింది. వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను 2021లో తయారు చేశారు. ఆ సమయంలో కేబుల్ ధరలు 2018–19 నుంచి 2019–20 ఆర్థిక సంవత్సరంలో డిస్కం కొనుగోలు చేసిన ధరలకు అనుగుణంగా తీసుకున్నారు. అయితే కోవిడ్ మహమ్మారి తెచ్చిన సంక్షోభం, విధించిన ఆంక్షల కారణంగా సరఫరా వ్యవస్థ బాగా ప్రభావితమైంది.
ముడిసరుకులైన అల్యూమినియం, రాగి, స్టీల్ వంటి వాటి ధరలు బాగా పెరిగాయి. కవర్ కండక్టర్, ఎక్స్‌ఎల్‌పీఈ కేబుల్స్, 33 కేవీ, 11 కేవీ ఆర్‌ఎంయూలు మొదలైనవి, అలాగే లేబర్ రేట్లు కూడా పెరిగాయి. వీటి ఆధారంగా మంజూరైన ధరతో పోలిస్తే బిడ్డర్లు కోట్ చేసిన రేట్లలో సహజంగానే పెరుగుదల ఉండవచ్చు.
ఆరోపణ: పోటీలో ఆ రెండు కంపెనీలే
వాస్తవం: రింగ్ మెయిన్ యూనిట్లు సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం పోర్టల్‌లో టెండర్లు ఆహ్వానించారు. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఇందులో బీహెచ్‌ఎల్, ఏబీబీ, సీమెన్స్, స్పైడర్ వంటి తయారీ సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ టెండర్ ప్రక్రియ ఈ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా పూర్తి పారదర్శకంగా జరుగుతోంది. ఆసక్తి కలిగిన గుత్తేదారులందరూ ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చు.
ఈ సాధారణ ప్రక్రియలో కనీస ధర ప్రతిపాదించి ఎల్ 1గా అర్హత పొందిన గుత్తేదారుకు మాత్రమే పనులు దక్కించుకొనే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ గ్రాంటును పొందడానికి టెండర్‌ను నిర్ణీత వ్యవధిలో ఖరారు చేయవలసి ఉంది. ఈ కారణంగా టెండర్ వివరాలను ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ పరిశీలనకు పంపించారు. వాస్తవాలు ఇలా ఉంటే అడ్డగోలుగా కట్టబెట్టేశారని రామోజీ గగ్గోలు దేనికో..!!
ఆరోపణ: రివర్స్ టెండరింగ్ ఓ బూటకం
వాస్తవం: 2022 డిసెంబర్ 9న జ్యుడిషియల్ ప్రివ్యూ ఇచ్చిన ఆమోదం మేరకు ఈ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా 2022 డిసెంబర్ 12న మొదటి టెండర్ ప్రకటన జారీ చేశారు. ఈ బిడ్ నెం.09/2022–23లో ఇద్దరు గుత్తేదార్లు పాల్గొన్నారు. సాంకేతిక పరిశీలన అనంతరం షిర్డీ సాయి, రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీల బిడ్లు అర్హత సాధించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రైస్ బిడ్స్‌లో ఎల్ 1 బిడ్డర్‌గా రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ ఆర్‌సీఐఎల్ అర్హత సాధించింది. గుత్తేదార్లు కోట్ చేసిన రేటు అధికంగా ఉండటం వల్ల రివర్స్ టెండర్ ప్రక్రియ కొనసాగించారు.
గుత్తేదార్ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టెండర్‌ను రద్దు చేశారు. తిరిగి ఏప్రిల్‌లో రెండోసారి టెండర్ ఆహ్వానించారు. ఈ రీ టెండరీంగ్ సమయంలో రింగ్ మెయిన్ యూనిట్ల పరికరాలను టెండర్ నుంచి మినహాయించారు. ఈ పరికరాల నాణ్యత, దీర్ఘకాల గ్యారెంటీ సౌకర్యం కోసం వాటిని డిస్కం ప్రత్యేకంగా కొనాలని నిర్ణయించింది. రింగ్ యూనిట్లు మినహాయించిన ఈ టెండర్లలో నలుగురు గుత్తేదారులు టెండర్లు దాఖలు చేశారు.
ఇందులో ఇద్దరు అర్హత సాధించగా సంబంధిత ధర నిర్ణయం కోసం రివర్స్ టెండరింగ్ నిర్వహించారు. రివర్స్ టెండరింగ్ ధరల ప్రకారం 2022–23 ప్రామాణిక ధరల పట్టిక (ఎస్‌ఎస్‌ఆర్) ఆధారిత అంచనాలకు మించి 8 శాతం అధికంగా ఎల్1 బిడ్డర్ ఆర్‌సీఐఎల్ దాఖలు చేసింది. ఇంత పక్కాగా, పూర్తి పారదర్శకంగా ఈ టెండర్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో బూటకం ఏముంది?
Comments
Please login to add a commentAdd a comment