కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డులో రైతుల నుంచి టమాటాలు కొనుగోలు చేస్తున్న మార్కెటింగ్ శాఖ సిబ్బంది
సాక్షి, అమరావతి: ధర లేని ప్రతిసారి టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. నాణ్యమైన టమాటాలనే కాదు, కాస్త వినియోగానికి పనికొచ్చేలా ఉన్న టమాటాలను మార్కెట్‌లో జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లోని పలు మార్కెట్ యార్డుల నుంచి 220 క్వింటాళ్ల టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు విక్రయించింది.
ఇదే రీతిలో మిగిలిన మార్కెట్ యార్డుల్లో కూడా ఎక్కడైనా ధర రావడం లేదు, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ ఆర్బీకేకు సమాచారం ఇస్తే చాలు యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో తెగుళ్ళు సోకి టమాటా పంట చాలా చోట్ల దెబ్బ తిన్నది. తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటంతో ఎగుమతులకు ప్రతిబంధకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ధరలను నిలకడగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వినియోగదారులపై భారం పడకుండా..
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డు పరిధిలో రైతుల నుంచి 150 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మార్కెట్ యార్డు పరిధిలోని రైతుల నుంచి 70 క్వింటాళ్లు టమోటాలు నాణ్యతను బట్టి కిలో రూ.5 నుంచి రూ.12 చొప్పున మార్కెట్‌శాఖ ద్వారా కొనుగోలు చేసింది. వీటిని స్థానిక రైతుబజార్లలో విక్రయిస్తోంది. టమాటా సాగు ఎక్కువగా ఉండే అన్నమయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని ప్రధాన టమాటా యార్డుల పరిధిలో రేటు దక్కని రైతుల నుంచి టమాటా కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. వర్షాలు, తెగుళ్ల వల్ల దెబ్బతిన్న టమాటా రైతులను ఆదుకుంటూ వినియోగదారులపై భారం పడకుండా సరసమైన ధరలకే రైతు బజారుల ద్వారా విక్రయిస్తోంది.
ప్రభుత్వ జోక్యంతో పెరిగిన ధర..
సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మార్కెట్‌లో జోక్యం చేసుకుంటూ వ్యాపారులతో కలిసి పోటీపడి ధర పెంచేలా మార్కెటింగ్ శాఖ కృషి చేస్తోంది. ఫలితంగా ఏపీలో ఏ ఒక్క మార్కెట్ యార్డులోనూ టమాటా కిలో రూ.5కు తక్కువగా పలకడం లేదు. నాణ్యతను బట్టి ఫస్ట్ క్వాలిటీ రకం గరిష్టంగా రూ.9 నుంచి రూ.13, కనిష్టంగా రూ.5 నుంచి 10 వరకు పలుకుతోంది. ఇక మధ్యస్థంగా ఉండే టమాటాలకు రూ.7 నుంచి రూ.11 వరకు ధర పలుకుతోంది.
ప్రభుత్వం ఆదుకుంటోంది
నేను 3 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాను. 20 రోజుల నుంచి మార్కెట్‌లో రేటు తగ్గిపోయింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెటింగ్ శాఖ ద్వారా టమాటాలను కొనుగోలు చేస్తోంది. కిలో రూ.5 నుంచి రూ.10 వరకు పెట్టి కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.
– బద్దునాయక్, గుండుతాండ, కర్నూలు జిల్లా
రైతులు ఆందోళన చెందవద్దు
టమాటా రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. వినియోగానికి పనికి వచ్చే టమాటాలను కొనుగోలు చేస్తాం. క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. మార్కెట్‌లో వ్యాపారాలు కొనుగోలు చేయకపోతే సమాచారమివ్వండి. పొలం వద్ద గ్రేడింగ్ చేసి తీసుకొస్తే మంచి ధర లభించేలా కృషి చేస్తాం. నాణ్యతను బట్టి రాష్ట్రంలో ఎక్కడా కిలో రూ.5 కు తక్కువగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు.
– ముల్లంగి నందకిషోర్, సీఈవో, రైతు బజార్స్
Comments
Please login to add a commentAdd a comment