
సాక్షి, అమరావతి: నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంటూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ)కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. దరఖాస్తు సమర్పణకు వచ్చే నెల 7వ తేదీ గడువు కావడం, ఇప్పుడు దరఖాస్తు చేయకపోతే ఒక సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉండటంతో హైకోర్టు ఈ వెసులుబాటు కల్పించింది.
వ్యవసాయ పరిశోధన కేంద్రంలో వైద్య కళాశాల ఏర్పాటుపై యథాతథస్థితి కొనసాగించాలంటూ గతంలో తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 18కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజుల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
వైద్య కళాశాల ఏర్పాటు నిమిత్తం నంద్యాలలోని వ్యవసాయ పరిశోధన కేంద్రానికి చెందిన 50 ఎకరాల భూమిని ప్రభుత్వానికి బదలాయించేందుకు వీలుగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గత ఏడాది జూన్ 20న చేసిన తీర్మానాన్ని సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన రైతులు బొజ్జా దశరాథరామిరెడ్డి, మరో నలుగురు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై మరిన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
వీటిపై సీజే ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కలెక్టర్ కౌంటర్‌కు సమాధానం ఇచ్చేందుకు తమకు గడువు కావాలని పిటిషనర్ల న్యాయవాది కోరారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ.. వైద్య కళాశాల ఏర్పాటు కోసం ఎన్‌ఎంసీకి వచ్చే నెల 7వ తేదీలోపు దరఖాస్తు సమర్పించాల్సి ఉందన్నారు. లేకపోతే ఈ సంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు.
అందువల్ల ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. సుధాకర్‌రెడ్డి వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. వ్యవసాయ పరిశోధన కేంద్రంలోనే వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌ఎంసీకి ఇచ్చే దరఖాస్తులో పేర్కొనవచ్చని స్పష్టం చేసింది. కళాశాల నిర్మాణంపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.