సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పనులు చకచకా సాగుతున్నాయి. లేఅవుట్లను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ప్లాట్ల సరిహద్దులు గుర్తించి రాళ్లు పాతే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వారం రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది.
గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి అర్బన్, రూరల్ ప్రాంతాలతోపాటు తుళ్లూరు, పెదకాకాని మండలాల్లో లబ్ధిదారులకు 23,192 మందికి రకరకాల కారణాలతో పట్టాలు పంపిణీ చేయలేదు. ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 25 వేల మందికి పట్టాలు ఇచ్చేందుకు లబ్ధిదారులను గుర్తించారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో రాష్ట్ర్‌ర ప్రభుత్వం జారీ చేసిన జీవో–45 ద్వారా భూమిని కేటాయించడం జరిగింది. గుంటూరు జిల్లాకు 550.65 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లాకు 583.94 ఎకరాలు మొత్తం కలిపి 1,134.,59 ఎకరాల భూమిని కేటాయించారు.
ఇప్పటికే పట్టాలు సిద్ధం
లబ్ధిదారులకు సంబంధించి మళ్లీ ఇంటింటికీ వెళ్లి వెరిఫికేషన్ చేయించారు. ఎవరైనా లబ్ధిదారులు మరణిస్తే.. వారి వారసుల పేరిట పట్టాలిచ్చారు.తాత్కాలిక అవసరాల నిమిత్తం కొందరు, శాశ్వతంగా మరికొందరు వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. వీరందరినీ గుర్తించి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు సిద్ధం చేయించారు.
ఇప్పటికే పట్టాలను సైతం ప్రింట్ చేయించారు. అందులో లబ్ధిదారుల వివరాలన్నీ పొందుపరిచారు. ఇందులో ముఖ్యమంత్రి సందేశం, లబ్ధిదారుని వివరాలు, ఆధార్ నంబర్, గ్రామం, వివరాలు, రెండు పేజీలలో డి.పట్టా, లేఅవుట్, ప్లాట్ హద్దులు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ పట్టాలపై సంబంధిత తహసీల్దార్‌తో సంతకాలు చేయించి అందుబాటులో పెట్టారు. వీరందరికీ ఇళ్లు కూడా కట్టించి ఇచ్చేందుకు వాటిని స్కాన్ చేసి ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వానికి పంపించారు.
6 గ్రామాల్లో 20 లేఅవుట్లు
ఐనవోలు, మందడం, నవులూరు, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాల్లో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల లబ్ధిదారుల కోసం 20 లేఅవుట్లు వేశారు. íసీఆర్‌డీఏకి భూమిని కేటాయించిన తర్వాత భూముల హద్దులు నిర్ధారించి.. ఆ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత లేఅవుట్లు సిద్ధం చేశారు. టౌన్‌ప్లానింగ్ నిబంధనలకు అనుగుణంగా లేఅవుట్లలో ఉండాల్సిన ఓపెన్ స్పేస్, రోడ్లు, డ్రెయిన్లు, పార్కింగ్, ఇతర అవసరాలకు కావాల్సిన భూమిని వదిలి ప్లాట్లు వేశారు.
సీఆర్‌డీఏ టౌన్‌ప్లానింగ్ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకున్నారు. అనుమతులు వచ్చిన తర్వాత అభివృద్ధి బాధ్యతను íసీఆర్‌డీఏకి ప్రభుత్వం అప్పగించింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లను ఎంపిక చేసి ప్రతి లేఅవుట్‌కు ఒక కాంట్రాక్టర్ ఉండేలా పనులు అప్పగించారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లెవలింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రతి లేఅవుట్ పూర్తిస్థాయిలో రావడం కోసం లెవలింగ్, జంగిల్ క్లియరెన్స్, రోడ్ల ఏర్పాటు, సరిహద్దుల మార్కింగ్ చేశారు.
సరిహద్దు రాళ్లు పాతి వాటికి తెల్లరంగు వేసి ప్లాట్ నంబర్లు వేసే పనులు చకచకా సాగుతున్నాయి. దీంతోపాటు రోడ్డు పక్కన డ్రెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి లేఅవుట్‌కు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను నియమించారు. మార్కింగ్ ఇవ్వడం కోసం 120 మంది సర్వేయర్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లను నియమించారు. వీరంతా మార్కింగ్ చేస్తున్నారు.
పేదల ఇళ్ల కోసం మరో 268 ఎకరాలు
సాక్షి, అమరావతి: ఏపీ సీఆర్డీఏ పరిధిలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకానికి ప్రభుత్వం మరో 268 ఎకరాలను కేటాయించింది. ఇందులో బోరుపాలెం, పిచికలపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో 168 ఎకరాలను ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లబ్ధిదారుల కోసం కేటాయించగా.. గుంటూరు జిల్లాకు చెందిన లబ్ధిదారుల కోసం మరో 100 ఎకరాలను నెక్కల్లులో కేటాయించింది. ఇప్పటికే పేదలందరికీ ఇళ్ల పథకానికి ప్రభుత్వం 1,134.58 ఎకరాలను కేటాయించి ప్లాట్లుగా వేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో సుమారు 50 వేల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుంది.
గతంలో ఇక్కడ 48,218 మంది లబ్ధిదారులకు చోటు కల్పించారు. అయితే, కేటాయించిన భూమిలో 40,502 ప్లాట్లు సిద్ధమవుతున్నాయి. మిగిలిన లబ్ధిదారులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అనువుగా అదనంగా భూమి ఇవ్వాలని రెండు జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. దాంతో మంగళవారం మరో 168 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రాంతంలో పేదలందరికీ ఇళ్లు పథకంలో ఎన్టీఆర్ జిల్లాకు 26,739 మంది, గుంటూరు జిల్లాకు చెందిన 23,235 మంది లబ్ధిదారులకు మొత్తం 49,974 ప్లాట్లు ఇవ్వనున్నారు.
సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీ
ఈ నెల 15వ తేదీ తర్వాత ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పట్టాల పంపిణీ జరుగుతుంది. సుమారు రెండు జిల్లాల్లో కలిపి 50 వేల మందికి పట్టాల పంపిణీ చేస్తాం. ఈ పట్టాలు పంపిణీ జరిగితే జిల్లాలో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తి అవుతుంది.– ఎం.వేణుగోపాలరెడ్డి, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment