సాక్షి, న్యూఢిల్లీ: డైరెక్ట్–టు–మొబైల్ (డీ–టు–ఎం) బ్రాడ్‌కాస్ట్ టెక్నాలజీ అభివృద్ధి పరిశోధన దశలో ఉన్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. టెలివిజన్ కార్యక్రమాలను నేరుగా స్మార్ట్‌ఫోన్లకు ప్రసారం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటీ–కాన్పూర్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. డీ–టు–ఎం టెక్నాలజీపై పరిశోధన, అభివృద్ధి కోసం ఐఐటీ–కాన్పూర్‌తో ప్రసారభారతి ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. ఈ ఏడాది జూన్ 1న నిర్వహించిన సమావేశంలో ఐఐటీ–కాన్పూర్ డీ–టూ–ఎం టెక్నాలజీపై ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించి శ్వేతపత్రం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని పరీక్షించడానికి బెంగళూరులో లైవ్ పీవోసీ టెస్టింగ్ సైట్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగే ఆలోచన లేదు
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలను విస్తృతం చేస్తూ వాటిలో సమర్థత సాధించే లక్ష్యాలతో జాతీయ క్రీడా విధానాన్ని రూపొందించినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. త్వరలో ఇంగ్లండ్‌లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలగే ఆలోచనేమీ లేదని చెప్పారు.
త్వరితగతిన స.హ. చట్టం కేసుల పరిష్కారం
సమాచారహక్కు చట్టం కింద దాఖలయ్యే కేసులను త్వరితగతిన పరిష్కరిస్తున్నట్లు పీఎంవో కార్యాలయం సహాయమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ కమిషన్లలో ఖాళీలను త్వరితగతిన భర్తీచేస్తూ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసినట్లు తెలిపారు. విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఆర్టీఐ ఫైలింగ్ ప్రక్రియను సరళతరం చేసే ప్రయత్నం జరిగిందని, తొలి అప్పీల్, మలి అప్పీల్, మూడో అప్పీల్‌కు కాలవ్యవధిని నిర్ణయించినట్లు చెప్పారు. సమాచారహక్కు చట్టం కింద 24 వేల మంది ప్రభుత్వ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. గత ఎనిమిదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నట్లు రుజువవుతోందని చెప్పారు.
ఎన్‌సీఏపీలో 11 పట్టణాలు
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ)లో ఆంధ్రప్రదేశ్‌లోని 11 పట్టణాలున్నాయని కేంద్ర అటవీ, పర్యావరణశాఖ సహాయమంత్రి అశ్వినికుమార్ చౌబే తెలిపారు. ప్రోగ్రామ్‌లో అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కర్నూలు నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, విజయనగరం పట్టణాలున్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమం అమలు నిమిత్తం ఆయా పట్టణాలకు రూ.232.36 కోట్లు బదిలీ చేశామని, ఏపీ కాలుష్యనియంత్రణ మండలి రూ.4.08 కోట్లు వినియోగించిందని తెలిపారు.
అఖిల భారత సర్వీసుల పదోన్నతుల్లో రిజర్వేషన్లు లేవు
అఖిల భారత సర్వీసుల పదోన్నతుల్లో రిజర్వేషన్ల ప్రొవిజన్ లేదని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్.. వైఎస్సార్‌సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు జవాబిచ్చారు.
ఎస్టీల్లో చేర్చాలన్న సిఫార్సులను త్వరగా పరిశీలించాలి
తమిళనాడు తరహాలో ఇతర రాష్ట్రాల్లోని కొన్ని వర్గాలను ఎస్టీల్లో చేర్చేందుకు చేసిన సిఫార్సులను త్వరగా జాతీయ ఎస్టీ కమిషన్ పరిశీలించి ఆయా వర్గాలను చేర్చాలని ఆర్.కృష్ణయ్య కోరారు. రాజ్యసభలో గురువారం ది కాన్‌స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్లు–2022పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ బిల్లుకు వైఎస్సార్‌సీపీ పూర్తిగా మద్దతు తెలుపుతోందని చెప్పారు. ఆదివాసీల్లో అవిద్య, మూఢనమ్మకాలు, పేదరికం సహా అనేక అంశాలను తొలగించాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వానికి ఉందన్నారు. గిరిజనుల విద్య, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేయాల్సి ఉందన్నారు.సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎస్టీ న్యాయమూర్తులు లేని కారణంగా న్యాయవ్యవస్థలోను ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎస్టీల్లో చేర్చాలన్న వినతిని పునర్విచారించాలి
ఏపీ, తెలంగాణల్లో బోయ, వాల్మీకి వర్గాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్‌లో చేర్చాలన్న డిమాండ్ అనేక సంవత్సరాలుగా ఉందని బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చెప్పారు. ది కాన్‌స్టిట్యూషన్ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (సెకండ్ అమెండ్‌మెంట్) బిల్లు–2022పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకలో బోయ, వాల్మీకిలను ఎస్టీలుగా గుర్తించారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో ఈ రెండు వర్గాలకు ఎస్టీ హోదా ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా లేదని చెప్పారు. దీనిపై గతంలో విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పునర్విచారణ చేయాలని కోరారు.
డీ–టు–ఎం బ్రాడ్‌కాస్ట్‌పై పరిశోధనలు.. విజయసాయి ప్రశ్నకు మంత్రి జవాబు
Published Fri, Dec 23 2022 6:20 AM | Last Updated on Fri, Dec 23 2022 10:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment