మత్స్యరంగంలో ఏపీ అద్భుత ప్రగతి | AP Amazing Progress In Fisheries | Sakshi
Sakshi News home page

మత్స్యరంగంలో ఏపీ అద్భుత ప్రగతి

Published Mon, Nov 22 2021 12:37 PM | Last Updated on Mon, Nov 22 2021 12:37 PM

AP Amazing Progress In Fisheries - Sakshi

కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాలా నుంచి అవార్డును అందుకుంటున్న రాష్ట్ర మత్స్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య తదితరులు

సాక్షి, అమరావతి: మత్స్యరంగంలో ఆంధ్రప్రదేశ్‌ అద్భుత ప్రగతి సాధిస్తోందని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పరుషోత్తమ్‌ రూపాలా ప్రశంసించారు. విప్లవాత్మక సంస్కరణలతో ఏపీ మత్స్య రంగం గణనీయమైన పురోగతి దిశగా అడుగులేస్తోందని అభినందించారు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఆదివారం భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో జాతీయ స్థాయిలో బెస్ట్‌ మెరైన్‌ స్టేట్‌ అవార్డును ఏపీ మత్స్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, కమిషనర్‌ కె.కన్నబాబులకు కేంద్ర మంత్రి ప్రదానం చేశారు. అవార్డు కింద రూ.10 లక్షల చెక్కుతో పాటు ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందజేశారు.

చదవండి: AP: శరవేగంగా విద్యుత్‌ పునరుద్ధరణ

అనంతరం పూనం మాలకొండయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో మత్స్యరంగ సుస్థిరాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని వివరించారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా అందించడంతో పాటు డీజిల్‌ సబ్సిడీ పెంపు, ఆక్వా రైతులకు విద్యుత్‌ టారిఫ్‌ తగ్గింపు తదితర ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం అమలుచేస్తోందన్నారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌ను ఆక్వా రైతులకు అందజేస్తున్నామని చెప్పారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా సాగు విస్తీర్ణంతో పాటు దిగుబడుల ఎగుమతుల్లో పెరుగుదల నమోదైందని చెప్పారు. 8 ఫిషింగ్‌ హార్బర్లు, రెండు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లు, నాలుగు ఫ్లోటింగ్‌ జెట్టీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందన్నారు. 70 ఆక్వా హబ్‌లు, 14 వేలకు పైగా అవుట్‌లెట్స్‌ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. మత్స్య రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అభినందించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులున్న మత్స్య ఉత్పత్తులను.. 22 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కేంద్ర మంత్రి మురుగన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement