AP Assembly Sessions 2022: CM Jagan Speech On Decentralization - Sakshi
Sakshi News home page

అది పెత్తందారుల ఉద్యమం: సీఎం జగన్‌

Published Thu, Sep 15 2022 4:26 PM | Last Updated on Fri, Sep 16 2022 7:29 AM

AP assembly Sessions 2022: CM Jagan Comments On Decentralization - Sakshi

సాక్షి, అమరావతి: ‘రాజధానులతో పాటు గ్రామ స్థాయి వరకు వికేంద్రీకరణే మా విధానం.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయడం.. ప్రతి ఇంటికి మేలు చేయడమే మా లక్ష్యం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విస్పష్టంగా ప్రకటించారు. ‘వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, ఆయనతో కూడిన దుష్టచతుష్టయం దాన్ని వక్రీకరిస్తూ ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. నారా హమారా అని యాత్రలు మొదలు పెట్టించి పెట్రోల్‌ పోసి మరీ ప్రాంతాల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో కుప్పంతోసహా ఎక్కడా గెలవలేమని తెలిసి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి కోసం కుట్రలు పన్నుతున్నారు’ అని ధ్వజమెత్తారు. వికేంద్రీకరణ అంశంపై గురువారం శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వ విధానాన్ని సోదాహరణంగా వివరించారు. ‘58 ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తుంటే, 58 ఏళ్ల రాజధాని హైదరాబాద్‌ను వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఒక్క రోజూ ఉద్యమం చేయని చంద్రబాబు.. ప్రస్తుతం అమరావతి పేరిట కృత్రిమ ఉద్యమాన్ని, రియల్‌ ఎస్టేట్‌ ఉద్యమాన్ని నడుపుతున్నారు.

చంద్రబాబు కట్టని, కట్టలేని.. ఎవరూ కట్టలేని రాజధాని కోసం ఎందుకు ఉద్యమం పేరిట డ్రామాలు ఆడుతున్నారు? ఈ ఉద్యమం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, పేద ఓసీల కోసం కాదు. దుష్టచతుష్టయంతో కూడిన పెత్తందార్ల ప్రయోజనాల కోసమే’ అని విరుచుకుపడ్డారు. ‘తమ బినామీ భూములు ఉన్న ప్రాంతమే రాజధానిగా ఉండాలి. తమ పత్రికే ఉండాలి. తమ చిట్‌ఫండ్‌ కంపెనీలే ఉండాలి. తమ పాల డెయిరీలే ఉండాలి. తమ సినిమాలు, తమ ఇండస్ట్రీలే ఉండాలి. మార్కెట్‌లో ఎవరూ ఉండకూడదు’ అనే పెత్తందారి పోకడలతో దుష్టచతుష్టయం.. అంటే చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ 5 నాయుడు.. వీరికి తోడు దత్తపుత్రుడు వ్యవహరిస్తున్నారు’ అని ఆయన దుయ్యబట్టారు.

ఆ ఐదేళ్లలో ఖర్చు చేసింది రూ.5,674 కోట్లే
అమరావతిలో మౌలిక వసతుల కల్పనకే రూ.1.10 లక్షల కోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు.. ఐదేళ్లలో కేవలం రూ.5,674 కోట్లే ఖర్చు చేశారని సీఎం తెలిపారు. మరి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణం కోసం రూ.5 లక్షల కోట్లు వెచ్చించేందుకు వందేళ్ల సమయం పడుతుందన్నారు. అప్పటికి ద్రవ్యోల్బణంతో వ్యయం రూ.30 లక్షల కోట్లకు చేరుతుందని.. అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ రాజధాని అంటూ చంద్రబాబు అండ్‌ గ్యాంగ్‌ చేస్తున్న ప్రచారం అవాస్తవమని గణాంకాలతో సహా వివరించారు. తమకు రాష్ట్రం అంటే అంటే కేవలం 8 కి.మీ.పరిధిలోని భూభాగం కాదని, 1,62,967 చ.కి.మీ యావత్‌ రాష్ట్రమని స్పష్టం చేశారు. రాష్ట్రం అంటే కేవలం 50 వేల ఎకరాలు కాదని.. 3.96 కోట్ల ఎకరాలన్నారు. తమకు రైతులు అంటే కేవలం అమరావతికి భూములు ఇచ్చిన 35 వేల మంది మాత్రమే కాదని, వారితో పాటు రాష్ట్రంలోని మరో 50 లక్షల మంది రైతులు అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 

చంద్రబాబు, ఆయన మనుషులే ఉండాలా?
చంద్రబాబు ఆయన బృందానివి పెత్తందారి ఆలోచనలు. వాళ్ల బినామీల భూములున్న ప్రాంతమే రాజధానిగా ఉండాలి. ఇంకెక్కడా ఉండకూడదు. పత్రిక అంటే కేవలం ఈనాడు, చంద్రజ్యోతి మాత్రమే. మరే పత్రికా ఉండకూడదు. పచ్చళ్లు అమ్మినా తమ వాళ్ల పచ్చళ్లే అమ్మాలి. చిట్‌ఫండ్స్‌ వ్యాపారం చేసినా  తమ వాడి చిట్‌ ఫండ్స్‌ వ్యాపారమే జరగాలి. డిపాజిట్స్‌ సేకరణ చేసినా తమవాడే చేయాలి. అది కూడా ఆర్‌బీఐ నిబంధనలు ఉల్లంఘించి చేసుకోవచ్చు.
డెయిరీలు, పాలు అంటే ప్రభుత్వ రంగంలో లాభాల్లో ఉన్న చిత్తూరు డెయిరీని కూడా మూసివేయాలి. తమ హెరిటేజ్‌ కోసం ఆ డెయిరీల పీక పిసికేయాలి. ఆ రంగం ఈ రంగం అనే తేడా లేదు. వారు వీరు అనే తేడా లేదు. ఎవ్వరూ కూడా మార్కెట్‌లో ఉండకూడదు. తాను తన మనుషులే ఉండాలి. అది ఇండస్ట్రీ అయినా, సినిమా అయినా ఏదైనా తాను తన మనుషులు మాత్రమే ఉండాలన్న పెత్తందారి మనస్తత్వం వారిది.

కార్పొరేట్‌ చదువులు తీసుకున్నా కేవలం మా నారాయణ, మా చైతన్య మాత్రమే ఉండాలి. గవర్నమెంటు బడులలో మాత్రం ఇంగ్లిష్‌ మీడియం ఉండకూడదు. అన్ని వ్యవస్థలు కూడా తమ మనుషుల చేతుల్లోనే ఉండాలి. ప్రతిపక్ష పార్టీల్లో కూడా తమ మనుషులే ఉండాలి. రాజధానితో పాటు ఏది తీసుకున్నా, వీళ్ల ఆలోచనలు, డిజైన్స్‌ అన్నీ ఈ మాదిరిగానే ఉంటాయి. వీటికి అందమైన పేర్లు కూడా పెడతారు. అలాంటి కుట్రపూరితమైన ఒక డిజైన్‌ పేరు.. ఒకటే రాజధానిగా అమరావతి. నిజంగా ఇది సాధ్యమయ్యే పనేనా అన్నది అందరూ ఆలోచించాలి. 

కట్టని కట్టలేని రాజధాని కోసం కృత్రిమ ఉద్యమం
1956 నుంచి 2014 వరకు 58 ఏళ్లు కలిసి ఉన్న రాష్ట్రం విడిపోయినప్పుడు చంద్రబాబు ఏనాడూ ఉద్యమం చేయలేదు. ఆ 58 ఏళ్లు రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను వదిలి వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడూ ఒక్కరోజు కూడా ఎలాంటి ఉద్యమం చేయలేదు. రామోజీరావు, రాధాకృష్ణ చంద్రబాబు బృందం ఎలాంటి బాధా పడలేదు. రాష్ట్రాన్ని విడగొట్టడానికి వీల్లేదని, ఈ పెత్తందార్లు, మహానుభావులు ఒక్కరోజూ ఉద్యమం చేయలేదు. ఎలాంటియాత్రా చేయలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేసేందుకు కోట్లు లంచమిస్తూ దొరికిపోయిన చంద్రబాబే ఈ ప్రాంతానికంతా టెంపరరీ అనే పేరు పెట్టారు.

58 నెలల కాలం రాజధానిగా పరిపాలించిన ప్రాంతం అమరావతి గురించి ఉద్యమాలట! చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయని, చేయలేని ప్రాంతం గురించి ఉద్యమాలట! ఇవాళ రకరకాల డ్రామాలు జరుగుతున్నాయి. ఈ పెత్తందార్లు, మహానుభావులు వారు కట్టని రాజధాని గురించి, కట్టలేని గ్రాఫిక్స్‌ గురించి వెయ్యి రోజులుగా ఒక కృత్రిమ ఉద్యమాన్ని, రియల్‌ ఎస్టేట్‌ ఉద్యమాన్ని నడుపుతున్నారు. మిగతా ప్రాంతాల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ.. మరోవైపు ఇతర ప్రాంతాలను రెచ్చగొడుతూ ఒక డ్రామా నడుపుతున్నారు.

నాడు లక్షల కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
2019లో రాష్ట్ర బడ్జెట్‌ను చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రవేశపెట్టారు. అప్పటి బడ్జెట్‌.. ఈ సంవత్సరం మనం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దాదాపు ఒకటే. అప్పుడు రూ.2.27 లక్షల కోట్లు అయితే ఈ ఏడాది రూ.2.50 లక్షల కోట్లు. మరి చంద్రబాబు హయాంలో జగనన్న అమ్మఒడి ఎందుకు లేదు? వైఎస్సార్‌ ఆసరా ఎందుకు లేదు?  చేయూత పథకం, రైతు భరోసా పథకాలు ఎందుకు లేవు? 

నవరత్నాల పథకాల ద్వారా ఏకంగా రూ.1.65 లక్షల కోట్లు బటన్‌ నొక్కి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఎలాంటి అవినీతి, వివక్ష లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి ఇచ్చాం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 31 లక్షల ఇళ్లపట్టాలు ఎందుకు లేవు? 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఎందుకు జరగలేదు? ఈ రోజు ఎందుకు ఈ పథకాలన్నీ జరుగుతున్నాయి?

చంద్రబాబు ప్రభుత్వంలో డబ్బులన్నీ ఎవరెవరి జేబులోకి పోయాయన్నది ఆలోచించాలి. ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టో గురించి ప్రచారం చేస్తుంటే మా అప్పలనర్సయ్య మాట్లాడుతూ.. ‘ఇవన్నీ అవుతాయా’ అని ప్రశ్నించారు. కానీ ఈరోజు మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. 

చంద్రబాబు హయాంలో దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ పథకం ఉండేది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు వీళ్ల పని దోచుకోవడం పంచుకోవడం. వారు ఏం దోచుకున్నా.. పంచుకున్నా అడిగేవాడు ఉండడు, రాసేవాడూ ఉండడు. మనలాంటి వాళ్లు ప్రశ్నిస్తే మైకులు నొక్కేస్తారు. దుష్ప్రచారాలు చేస్తారు.

పరిపాలనా వికేంద్రీకరణతో మంచి ఫలితాలు
వికేంద్రీకరణ అనేది కేవలం రాజధానికి మాత్రమే కాదు. పరిపాలన అందరికీ అందాలన్నా వికేంద్రీకరణ అవసరం. 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే వ్యక్తి ఎప్పుడైనా గ్రామసచివాలయాల గురించి ఆలోచించారా?. ఒక్కో సచివాలయంలో ప్రస్తుతం 600 రకాల సేవలు అందుతున్నాయి. సచివాలయాల్లో ఉద్యోగులుగా 83శాతం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. 2.70లక్షల వాలంటీర్లు మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్నారు.

ఇంటింటికీ రేషన్‌ అందిస్తున్నాం. 14 ఏళ్లలో చంద్రబాబు ఏనాడైనా ఇలా ఆలోచించారా?. 40 ఏళ్ల ఇండస్ట్రీ బాబుకు రైతుభరోసా కేంద్రాలు పెట్టాలన్న ఆలోచన రాలేదు. మన హయాంలో మారుమూల గ్రామాల్లో ప్రతి గడపకూ పాలన తీసుకెళ్లాం. పరిపాలనా వికేంద్రీకరణ అంటే ఏమిటో చేసి చూపించాం. 

ఆనాడు బాబు గాడిదలు కాశారా?
ప్రతి గ్రామంలో డిజిటల్‌ లైబ్రరీలు, విలేజ్‌ క్లినిక్‌ల ఏర్పాటు చేశాం. గత 75 ఏళ్లలో రెండు జిల్లాలు ఏర్పాటు చేస్తే మేం వచ్చాక కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశాం. అధికార వికేంద్రీకరణ అంటే ఇది. అధికార వికేంద్రీకరణ వల్లే వరద బాధితులకు సాయం చేయగలిగాం. గోదావరి చరిత్రలో అతిపెద్ద వరదలు వచ్చినా సమర్థంగా పనిచేశాం. 16 మెడికల్‌ కాలేజీ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. చివరాఖరుకు కుప్పంలో రెవెన్యూ డివిజన్‌ పెట్టాలని బాబు లేఖ రాశారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు గాడిదలు కాశారా?. పాలనా వికేంద్రీకరణ సత్పలితాలిస్తోంది. 

పాదయాత్రను స్పాన్సర్‌ చేస్తోంది చంద్రబాబే
తన స్వార్థం కోసం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 23 సీట్లూ రావని చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు, దుష్టచతుష్టయాన్ని మార్చడం ఎవరి వల్లా కాదు. పాదయాత్రను స్పాన్సర్‌ చేస్తోంది చంద్రబాబే. బుద్ది ఉన్న వ్యక్తి ఎవరూ ఇలా విద్వేషాలు రెచ్చగొట్టరు. పెట్రోల్‌, డీజిల్‌ పోసి ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం ఇంత దిగజారాలా?. అందరూ బాగుండాలని కోరుకుంటే అది సమాజం. ఇంటింటికీ, మనిషిమనిషికీ మంచి చేయాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం అని వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా సీఎం జగన్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement