ఆ విషయంపై కేటీఆర్‌, మహారాష్ట్ర సీఎం కేంద్రాన్ని ప్రశ్నించారు: సీఎం జగన్‌ | AP Assembly Sessions 2022: CM Jagan on Development of industrial sector | Sakshi
Sakshi News home page

11.43% గ్రోత్‌రేట్‌తో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌: సీఎం జగన్‌

Published Mon, Sep 19 2022 2:49 PM | Last Updated on Mon, Sep 19 2022 4:22 PM

AP Assembly Sessions 2022: CM Jagan on Development of industrial sector - Sakshi

సాక్షి, అమరావతి: మూడేళ్లలో 99 భారీ పరిశ్రమలు రాష్ట్రంలో ఉత్పత్తిని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. భారీ పరిశ్రమల ద్వారా 46,280కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. వీటి ద్వారా రాష్ట్రంలో 62వేల 541 మందికి ఉపాధి లభించిందని వెల్లడించారు. మరో 40వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయన్నారు. మరో నాలుగు కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్మాణ దశలో ఉన్నట్లు సీఎం జగన్‌ వివరించారు.

పారిశ్రామిక అభివృద్ధిపై అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. 'గడిచిన మూడేళ్లో అభివృద్ధి దిశగా అనేక అడుగులు పడ్డాయి. బల్క్‌ డ్రగ్స్‌ కోసం దేశంలో 17 రాష్ట్రాలు పోటీపడ్డాయి. 17 రాష్ట్రాలతో పోటీ పడి బల్క్‌డ్రగ్స్‌ పార్క్‌ సాధించాం. బల్క్‌డ్రగ్‌ పార్క్‌ వద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుతో 30వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. బల్క్‌డ్రగ్‌ పార్క్‌ వల్ల ఎలాంటి పొల్యూషన్‌ ఉండదు. గతంలో దివీస్‌ ఫార్మా వచ్చినపుడు చంద్రబాబుకు పొల్యూషన్‌ గుర్తురాలేదా?. నిబంధనల ప్రకారం పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. బల్క్‌డ్రగ్‌ పార్క్‌ మాకు ఇవ్వలేదని కేంద్రాన్ని కేటీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయంపై మహారాష్ట్ర సీఎం కూడా కేంద్రాన్ని ప్రశ్నించారు. 

చిన్న తరహా పరిశ్రమలను పోత్రహిస్తున్నాం
పారిశ్రామిక ప్రగతి చంద్రబాబు హయాంలో కంటే ఇప్పుడు బాగుంది. వరుసగా మూడో ఏడాది ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నంబర్‌ వన్‌. గతం కంటే అధికంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై పారిశ్రామిక వేత్తలు సంతృప్తిగా ఉన్నారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటోంది. ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.2,500 కోట్ల ఇన్సెంటివ్‌లు ఇచ్చాం. చిన్న తరహా పరిశ్రమలను పోత్రహిస్తున్నాం. ఎంఎస్‌ఎంఈ రంగం ద్వారా 12లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాం. చంద్రబాబు ఎగ్గొట్టిన బకాయిలను ఈ ప్రభుత్వం చెల్లిస్తోంది. లక్షల మందికి ఉపాధినిచ్చే ఎంఎస్‌ఎంఈని బాబు కూల్చేశారు. మా ప్రభుత్వ చర్యలతో పారిశ్రామిక రంగం నిలదొక్కుకుంది. యువతలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాం. 

ఇతర రాష్ట్రాలకంటే మెరుగైన స్థానంలో
గ్రనైట్‌ పరిశ్రమలకు కూడా పోత్సాహకాలు ప్రకటించాం. ప్రభుత్వంపై పారిశ్రామిక వేత్తలకు భరోసా పెరిగింది. గతంలో దేనికైనా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు పారదర్శకంగా పనులు జరుగుతున్నాయి. చంద్రబాబులా మేం అవాస్తవాలను ప్రచారం చేయడం లేదు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది. సెంచురీ ఫ్లైవుడ్‌, సన్‌ఫార్మా, బిర్లా, అదానీ, ఆదిత్య మిట్టల్‌ వంటి దేశంలో ప్రఖ్యాతి గాంచిన సంస్థలు ఏపీకి వస్తున్నాయి. కరోనా సంక్షోభంలో కూడా ఏపీ ప్రభుత్వం నిలదొక్కుకుంది. మంచి పనితీరుతో ఇతర రాష్ట్రాలకంటే మెరుగైన స్థానంలో ఉంది. 11.43% గ్రోత్‌రేట్‌తో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌స్థానంలో ఉంది అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్‌లు
అన్ని రంగాలపై కోవిడ్‌ ప్రభావం ఉన్నా ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఏటా సగటున మెరుగైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. చంద్రబాబు హయాంలో సగటున రూ.11,94 కోట్ల పెట్టుబడులు వస్తే ఈ మూడేళ్లలో సగటున రూ.12,702 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కాకినాడలో బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ఏర్పాటుతో 30వేల మందికి ఉపాధి. కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్నాం. విశాఖ-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్‌-బెంగళూరు కారిడార్‌ల అభివృద్ధి. 

మూడేళ్లలో 2 లక్షల 6వేల 630 ప్రభుత్వ ఉద్యోగాలు
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 3లక్షల 97వేల ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. చంద్రబాబు హయాంలో 34,108 ఉద్యోగాలు మాత్రమే వచ్చాయి. ఈ మూడేళ్లలో 2 లక్షల 6వేల 630 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఔట్‌సోర్సింగ్‌లో 3.71లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తంగా 6.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. గ్రామవార్డు సచివాలయాల్లోనే 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించాం. ఇందులో 84​‍% మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. ఆర్టీసీ విలీనం ద్వారా ఉద్యోగుల ఆకాంక్ష నెరవేర్చాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి 51,387 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. వైద్యరంగంలో 16,880 ఉద్యోగాలు కల్పించాం. 2.60 లక్షల మందికి వాలంటీర్లుగా అవకాశం కల్పించాం.

స్వయం ఉపాధితో విప్లవాత్మక మార్పులు
స్వయం ఉపాధితో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. వైఎస్సార్‌ వాహన మిత్రతో 2లక్షల 74వేల మంది కుటుంబాలకు లబ్ది చేకూర్చాం. జగనన్న చేదోడు ద్వారా 2లక్షల 98వేల మందికి ప్రయోజనం పొందారు. సున్నావడ్డీ రుణాలతో మహిళా సంఘాలకు అండగా నిలిచాం. స్వయం ఉపాధి రంగం ద్వారా 55.57లక్షల మందికి లబ్ధి చేకూర్చాం. ప్రభుత్వం వాళ్లందరికీ తోడుంటం వల్లే 11.43% గ్రోత్‌ రేట్‌ సాధ్యమైంది. 

ఏ మంచి జరిగినా తట్టుకోలేకపోతున్నారు
ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకు ఇష్టం ఉండదు. ప్రతిపక్షంలో ఉండి ఏ మంచి జరిగినా తట్టుకోలేకపోతున్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఏడుస్తారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాటు పడితే ఏడుస్తారు. కరువుకు కేరాఫ్‌ ఎవరంటే బాబే అని చెబుతారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసింది ఎవరంటే బాబే అంటారు. ఎన్టీఆర్‌కు వెన్పుపోటు పొడిచింది బాబే అంటారు. పార్టీని, ట్రస్ట్‌ను లాక్కున్నది చంద్రబాబు అంటారు. రాష్ట్ర విభజనకు తొలిఓటు వేసింది చంద్రబాబే అంటారు. చంద్రబాబు అండ్‌ కో, దుష్టచతుష్టయం మనల్ని చూసి ఏడుస్తున్నారు. పేదల పిల్లలను ఇంగ్లీష్‌ మీడియంలో చదివిస్తే ఏడుస్తారు. వికేంద్రీకరణ చేస్తామన్నా​ ఏడుస్తారని అసెంబ్లీ వేదికగా సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement