సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ఏపీ రాష్ట్రంలో షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు పారిశ్రామిక రంగానికి రుణాల మంజూరును జోరుగా కొనసాగించాయి. దేశం మొత్తం మీద.. దక్షిణాది రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగానికి రుణాల మంజూరు తిరోగమనంలో ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం వృద్ధి నమోదైంది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి మూడేళ్లుగా అంటే 2019 నుంచి 2021 మార్చి వరకు బ్యాంకు రుణాల మంజూరు పెరిగింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఏటేటా తగ్గుతూ వస్తోంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో సైతం 2019 నుంచి 2021 మార్చి వరకు ఏటేటా రుణాల మంజూరు తగ్గింది. వివిధ రాష్ట్రాల్లో పారిశ్రామిక రంగానికి షెడ్యూల్ వాణిజ్య బ్యాంకుల రుణాల మంజూరు తీరుపై ఆర్‌బీఐ ఇటీవల విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. 2020 మార్చి వరకు 2021 మార్చి నాటికి పోల్చి చూస్తే దేశ వ్యాప్తంగా పారిశ్రామిక రంగానికి బ్యాంకు రుణాల మంజూరు 3.9 శాతం తిరోగమనంలో ఉంది.
దక్షిణాది రాష్ట్రాల్లో కూడా 0.43 శాతం క్షీణత నమోదైంది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 5.3 శాతం వృద్ధి నమోదైంది. ఇందుకు ప్రధాన కారణం కోవిడ్ సంక్షోభంలో కూడా జాగ్రత్తలతో పరిశ్రమలు పని చేయడానికి అనుమతించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా పారిశ్రామిక రాయితీలను విడుదల చేయడమే. ప్రధానంగా ఎంఎస్‌ఎంఈలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బ్యాంకుల ద్వారా పారిశ్రామిక రంగానికి రుణాలు మంజూరు చేసే వాతావరణాన్ని కల్పించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎంఎస్‌ఎంఈలకు రూ.44,500 కోట్ల మేర బ్యాంకు రుణాలను మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ధారించగా ఆరు నెలల్లోనే అంటే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.24,896 కోట్ల (55.95 శాతం) రుణాలు మంజూరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment