
ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఏపీ కార్ల్)కు మహర్దశ పట్టనుంది.
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఏపీ కార్ల్)కు మహర్దశ పట్టనుంది. పశు సంపద, పాల ఉత్పత్తుల్ని పెంచడంతోపాటు అందుకు అవసరమైన పరిశోధనలు చేపట్టే లక్ష్యంతో వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలోని పెద్ద రంగాపురంలో దీనిని నెలకొల్పారు. మహానేత మరణానంతరం ఇది నిరాదరణకు గురైంది. దాదాపు రూ.300 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు దాదాపు పదేళ్లపాటు పూర్తిగా పక్కన పెట్టేశాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత పశు సంపద, పాల ఉత్పత్తుల పెంపుదల, వీటికి సంబంధించిన పరిశోధనలు చేపట్టేందుకు ఏపీ కార్ల్‌పై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది.
ఇక వాక్సిన్ తయారీ ఇక్కడే
►ఇకపై రాష్ట్రంలోనే పశు వ్యాధుల నివారణ వాక్సిన్ తయారు చేసే విధంగా హైదరాబాద్‌కు చెందిన ఐజీవై ఇమ్యూనోలాజిక్స్ ఇండియా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ
కుదుర్చుకుంది.
►పీపీపీ విధానంలో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది జూలై నుంచి అన్ని రకాల పశు వ్యాక్సిన్ల తయారీ ఇక్కడ ప్రారంభమవుతుంది.
►ఇందుకోసం ఐజీవై సంస్థ దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 100 మంది నిపుణులు, సిబ్బందికి ఇక్కడ ఉపాధి లభించనుంది.
మూడు కాలేజీలొస్తాయ్
►ఇక్కడే వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్ధక కళాశాలలను కూడా ఈ ఏడాది ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
►కోవిడ్–19 నేపథ్యంలో విద్యాసంవత్సరం ప్రారంభం కాకపోవడంతో ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఇంకా ప్రారంభం కాలేదు.
► రాష్ట్రంలో అరటి సాగు విస్తీర్ణం రాయలసీమ ప్రాంతంలోనే అధికంగా ఉండటంతో ఈ ప్రాంగణంలోనే 70 ఎకరాల విస్తీర్ణంలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.
►తిరుపతిలోని వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికి ఈ ప్రాంగణంలోనే పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇందుకోసం రూ.18 కోట్లు వెచ్చిస్తారు.
►2021 నాటికి ఏపీ కార్ల్‌లో ఈ సంస్థలన్నీ కార్యకలాపాలు చేపట్టే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది.
చదవండి: ప్రభుత్వానికి రూ.4,881 కోట్ల అదనపు ఆదాయం