కార్పొరేషన్లతో... బీసీల్లో ప్రతి కులానికీ గుర్తింపు | AP Govt Given Identity for each caste in BC | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్లతో... బీసీల్లో ప్రతి కులానికీ గుర్తింపు

Published Tue, Oct 20 2020 3:34 AM | Last Updated on Tue, Oct 20 2020 7:49 AM

AP Govt Given Identity for each caste in BC - Sakshi

సాక్షి, అమరావతి: బీసీ కులాల్లోని నాయకుల గుర్తింపునకు ప్రత్యేకంగా రాజకీయ, ప్రభుత్వ పదవులు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పాన్ని పలువురు బీసీ సంఘాల నేతలు అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన రాజకీయ నాయకులు తప్ప ఆచరణలో చూపినవారు లేరని ఆయా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్‌ల ఏర్పాటు ద్వారా 56 మంది చైర్మన్‌లు, 672 మంది డైరెక్టర్‌లుగా ఎంపికయ్యారని, ఇప్పటికే ఎమ్మెల్యేలు, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు ఇవ్వడంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు.

అణగారిన కులాల్లో ఆత్మ విశ్వాసం
దేశంలోనే బీసీలను ఈ స్థాయిలో గౌరవించిన రాజకీయ నాయకులు ఎవరూ ఇంతవరకు లేరు. కార్పొరేషన్‌ల ఏర్పాటు ద్వారా అణగారిన బీసీ కులాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. సీఎం నిర్ణయంతో భిక్షాటన, సంచార జాతుల వారూ పాలనలో భాగస్వాములు అయ్యారు. చైర్మన్‌లకు ప్రొటోకాల్‌ ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా వారి విన్నపాలు మన్నిస్తారు. బీసీల్లో ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయికి వెళతాయి.    
– ఆర్‌.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం 

మంచి వ్యవస్థకు శ్రీకారం
బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్ష కాదని సీఎం వైఎస్‌ జగన్‌ నిరూపించారు. కార్పొరేషన్‌ల ఏర్పాటు ద్వారా మంచి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. బీసీల్లోని దాదాపు అన్ని కులాల నాయకులకు గుర్తింపు వచ్చింది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్‌లు గ్రామ స్థాయిలో బీసీల వృత్తులపై అధ్యయనం చేయాలి. 
    – పి.హనుమంతరావు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

శుభ పరిణామం
కార్పొరేషన్ల ఏర్పాటు శుభ పరిణామం బీసీ కులాలకు తగిన గుర్తింపు ఇలాంటి పదవుల ద్వారానే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే బీసీ కార్పొరేషన్‌ నిర్వీర్యం కాకూడదు.              
 – కేశన శంకర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

వృత్తులను ప్రోత్సహించాలి
బీసీల్లో కుల వృత్తులకు జీవం పోసేందుకు ఇది దోహద పడుతుంది. కార్పొరేషన్‌లకు తగిన నిధులు కేటాయించడం ద్వారా ఆయా కులాలను ఆర్థికంగా ఆదుకోవచ్చు. జిల్లా స్థాయిలోనూ ఈ కార్పొరేషన్‌లకు ఒక కమిటీ ఉంటే బాగుంటుంది.     
– టి. వేణుగోపాల్‌ యాదవ్, జాతీయ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ప్రభుత్వ అద్భుతాల్లో ఇది ఒకటి
సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన అద్భుతాల్లో గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ బడుల్లో నాడు–నేడుతోపాటు బీసీ కులాలకు కార్పొరేషన్‌ల ఏర్పాటు ఒకటి.ఎన్టీఆర్‌ ఒక స్థాయిలో బీసీల్లో రాజకీయ నాయకత్వ పెంపునకు పునాది వేశారు. వైఎస్‌ జగన్‌ అన్ని స్థాయిల్లో పునాదులు వేశారు.
    – కిర్ల కృష్ణారావు, సామాజిక సేవకుడు, కార్మిక నాయకుడు 

50% మంది మహిళలుండేలా చేయడం విశేషం
చంద్రబాబు కేవలం 11 బీసీ కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసి తక్కిన కులాలకు తీరని అన్యాయం చేశారు. వైఎస్‌ జగన్‌ బీసీల్లోని అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేస్తూనే అందులో 50% మంది మహిళలుండేలా చేయడం విశేషం. అధికారానికి ఏళ్ల తరబడి దూరంగా ఉన్న వారికి అధికారంతో కూడిన హక్కులు  కల్పించారు. 
– డాక్టర్‌ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి, అఖిలభారత బీసీ ఫెడరేషన్‌ రాష్ట్ర సెక్రెటరీ జనరల్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement