బీసీ కులాల ఆత్మీయ సమావేశం పిలుపు
బీసీలకు సీఎం జగన్ 70 శాతం పదవులు ఇచ్చారు: ఆర్.కృష్ణయ్య
సాహసోపేతంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నారు
సీఎం జగన్‌ను దేశం మొత్తం కీర్తిస్తోంది
సామాజిక న్యాయ విధాత సీఎం జగన్: ఎంపీ కేశినేని నాని
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ గెలిపించడం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలు మళ్లీ గెలవాలని బీసీ కులాల ఆత్మీయ సమావేశం పిలుపునిచ్చింది. విజయవాడ గాందీనగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు చెందిన సంఘాల ముఖ్య నేతల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ 58 నెలల పాలనలో బీసీలకు జరిగిన ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రయోజనాలపై పలువురు వక్తలు మాట్లాడారు.
రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. జనాభాలో 52 శాతంపైగా ఉన్న బీసీలకు కనీసం 50 శాతం పదవులు ఇవ్వాలని ఇంతకాలం కొట్లాడామని, అయితే సీఎం వైఎస్ జగన్ బీసీలకు ఏకంగా 70 శాతం పదవులు ఇచ్చి సంఘ సంస్కర్తగా నిలిచారని అన్నారు. ఇటీవల తాను కర్ణాటక, తమిళనాడు ముఖ్యమంత్రులను కలిసినప్పుడు.. బీసీలైన మీరు బీసీలకు 50 శాతం పదవులు ఎందుకివ్వలేకపోతున్నారు? అని అడిగితే వాళ్లు ఇచ్చిన సమాధానం ఆశ్చర్యం కలిగించిందన్నారు.
మేము 40 శాతం పదవులు ఇవ్వడానికే ఇబ్బందులు పడ్డామని, మీ ముఖ్యమంత్రిలాగా మేము బీసీలకు పదవులు ఇస్తే మా రాష్ట్రాల్లో సంపన్న వర్గాలు మమ్మల్ని సీఎం సీటులో కూర్చోనీయవని చెప్పారన్నారు. సీఎం వైఎస్ జగన్ మాదిరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రాధాన్యత ఇవ్వాలంటే ఎంతో ధైర్యం, సాహసం ఉండాలన్నారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయాన్ని దేశం మొత్తం కీర్తిస్తోందన్నారు.
ఏపీలో కలుస్తామంటున్నారు..
ఏపీలో ప్రభుత్వ విద్యా సంస్థల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలు పట్ల పొరుగు రాష్ట్రాల్లోని సరిహద్దు జిల్లాల ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారని కృష్ణయ్య తెలిపారు. ఈ కార్యక్రమాలు చూసి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా, కర్ణాటకలోని బళ్లారి ప్రాంత వాసులు తమను ఆంధ్రాలో కలపాలని దీక్షలు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను చంద్రబాబు ఓటు బ్యాంకుగా చూస్తే.. సీఎం జగన్ మాత్రం తన కుటుంబ సభ్యులుగా చూస్తున్నారని చెప్పారు.
సీఎం జగన్ మరో 20 ఏళ్లపాటు ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగితే పేద వర్గాలు ధనవంతులుగా మారడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు జరిగిన మంచిని ప్రతి ఇంటికి తిరిగి వివరించాలన్నారు. ఇది సీఎం జగన్ ఒక్కడి గెలుపుకోసం మాత్రమే కాదని, రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గెలుపు కోసమే అని కృష్ణయ్య చెప్పారు.
మానవ వనరుల అభివృద్ధే అసలైన అభివృద్ధి
విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని) మాట్లాడుతూ.. మానవ వనరుల అభివృద్ధే అసలైన అభివృద్ధి అని నమ్మి దానిని రాష్ట్రంలో అమలు చేసి చూపించిన గొప్ప నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. సీఎం జగన్ రాష్ట్రంలో విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంతో కూడిన నాణ్యమైన విద్య, ప్రజలకు ఆరోగ్యం, పేదలకు సంక్షేమం అందిస్తున్న తీరు భారతదేశ చరిత్రలోనే ఒక సరికొత్త అధ్యాయం అన్నారు. చంద్రబాబు పోకడలతో విసిగిపోయిన తాను సీఎం జగన్ విధానాలు నచ్చి ఆయన వెంట నడుస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్ సామాజిక న్యాయ విధాతగా పేరొందారని చెప్పారు. రాష్ట్రంలో సంక్షేమం తప్ప అభివృద్ధి లేదనే విమర్శల్లో నిజం లేదన్నారు.
ఈ విషయంలో తాను కూడా మొదట ఆపోహ పడ్డానని, సీఎం జగన్ పాలనలో అభివృద్ధి బాగా జరిగిందనే విషయం తాను ప్రత్యక్షంగా చూసి తెలుసుకున్నానని చెప్పారు. తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పర్యటించినపుడు గ్రామాల్లో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, నాడు నేడు ద్వారా మారిన స్కూల్స్ కనిపించాయన్నారు. వాటి కోసం రూ.30 వేల కోట్లుపైగా ఖర్చు చేసినట్టు గణాంకాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని, ఇది కాదా అభివృద్ధి? అని నాని ప్రశ్నించారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి తాత్కాలిక సచివాలయం కడితే.. అదే సీఎం వైఎస్ జగన్ ప్రతి రెండు వేల మందికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు ఓసీలకు ఇచ్చే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను బీసీలకు ఇచ్చి గెలిపించిన దాఖలాలు లేవన్నారు.
సీఎం జగన్ మాత్రం ఓసీలకే పరిమితం అనుకున్న సీట్లు సైతం బీసీలకు కేటాయించి సోషల్ ఇంజనీరింగ్‌లో సరికొత్త భాష్యం చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, విజయవాడ పశ్చిమ, మైలవరం నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిలు షేక్ ఆసీఫ్, సర్నాల తిరుపతిరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్, ప్రధాన కార్యదర్శి రావులకొల్లు వెంకట మల్లేశ్వరరావు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేముల బేబీరాణి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వినర్ జక్కా శ్రీనివాసరావు మాట్లాడారు. రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా నియమితుడైన ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.మారేష్ ను ఈ సందర్భంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment