
సాక్షి, అమరావతి: వ్యవసాయ పరపతి సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికల నిర్వహణకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు మంగళవారం నివేదించింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పష్టం చేశారు. సహకార సంఘాల్లో సభ్యత్వాల యథార్థతను తేలుస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది కూడా అందులో తెలియచేస్తామని వివరించారు. కాలపరిమితి ముగిసిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న చట్టం నిబంధన నుంచి రాష్ట్రంలోని అన్ని పరపతి సహకార సంఘాలను మినహాయిస్తూ ప్రభుత్వం 2019లో జీవో 475 జారీ చేసింది. పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిలను నియమించింది.
జీవో 475తోపాటు పర్సన్ ఇన్‌చార్జిల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఈ సమయంలో సీజే స్పందిస్తూ ఎన్నికలు ఎప్పుడు పెడతారని ప్రశ్నించారు. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏజీ బదులిచ్చారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన వాసిరెడ్డి ప్రభునాథ్ జోక్యం చేసుకుంటూ.. జీవో చెల్లుబాటునూ తేల్చాల్సిన అవసరముందన్నారు. అన్ని అంశాలపై విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. అఫిడవిట్ దాఖలుకు ప్రభుత్వానికి గడువునిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 7కి వాయిదా వేసింది.