అన్నదాతలకు శుభవార్త | AP Govt will deposit zero interest subsidy in farmers accounts on 20th April | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు శుభవార్త

Published Mon, Apr 19 2021 3:08 AM | Last Updated on Mon, Apr 19 2021 8:28 AM

AP Govt will deposit zero interest subsidy in farmers accounts on 20th April - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద రబీ–2019లో అర్హత పొందిన రైతులకు సున్నా వడ్డీ రాయితీ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ–క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేపట్టినప్పటికీ.. రబీ–2019 సీజన్‌కు ఆ నిబంధనతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 6,27,908 మంది రైతులకు రూ.128.47 కోట్ల మేర లబ్ధి చేకూరనుండగా.. ఈ నెల 20న నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా సర్కారు ఏర్పాట్లు చేసింది.

రూ.లక్షలోపు రుణం తీసుకున్న రైతులకు వర్తింపు
వ్యవసాయ అవసరాల కోసం రూ.లక్షలోపు పంట రుణాన్ని తీసుకుని సకాలంలో వాయిదాలు (కిస్తీలు) చెల్లించిన రైతులకు వారు కట్టిన వడ్డీ (4 శాతం) మొత్తాన్ని ‘వడ్డీ లేని రుణ పథకం’ కింద గతంలో బ్యాంకులకు జమ చేసేవారు. రుణాలు సకాలంలో చెల్లించినప్పటికీ ఎప్పుడో రెండు మూడేళ్లకు ప్రభుత్వం జమ చేసే ఈ మొత్తాన్ని అప్పులిచ్చే సమయంలో బ్యాంకర్లు సర్దుబాటు చేసుకునే వారు. అలాంటిది రూ.లక్షలోపు పంట రుణాలపై రైతులు చెల్లించిన వడ్డీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్‌–2019 సీజన్‌లో 43,28,067 మంది రుణాలు పొందగా.. వారిలో 25,96,840 మంది రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారున్నారు. నిర్ణీత గడువులోగా వడ్డీతో సహా చెల్లించిన 14.25 లక్షల మంది ఈ పథకం కింద అర్హత పొందారు. వీరికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ కింద గతేడాది నవంబర్‌లో రూ.289.41 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసింది. 

6.28 లక్షల మంది రైతులకు రూ.128.47 కోట్లు
రబీ–2019–20 సీజన్‌లో 28,08,830 మంది రుణాలు పొందగా.. వారిలో రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారు 16,85,298 మంది ఉన్నారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన వారిలో ఇప్పటివరకు 6,27,908 మంది రైతుల వివరాలను సున్న వడ్డీ పథకం రుణాలు (ఎస్‌వీపీఆర్‌) పోర్టల్‌లో  బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేశారు. వాస్తవ సాగుదారులకు మాత్రమే వడ్డీ రాయితీ అందించాలన్న సంకల్పంతో ఈ జాబితాను ఈ–క్రాప్‌తో సరిపోల్చి 2,50,550 మంది రైతులను వ్యవసాయ శాఖ అర్హులుగా గుర్తించింది. రైతులకు సాయం చేసే విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సూచించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్లు అర్హులుగా గుర్తించిన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చాలని ఆదేశించారు. దీంతో బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేసిన 6,27,906 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. వీరందరికీ ఈ నెల 20వ తేదీన రూ.128.47 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేశారు.

పాత బకాయిలూ చెల్లింపు
వడ్డీ లేని రుణ పథకం కింద 2014–15 నుంచి 2018–19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన బకాయిలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించి రైతుల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఈ విధంగా 35 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.789.36 కోట్లను సున్నా వడ్డీ రాయితీ కింద ప్రభుత్వం జమ చేసింది. ఇంకా సున్నా వడ్డీ రాయితీ కింద రూ.78 కోట్లతోపాటు పావలా వడ్డీ కింద రూ.42.39 కోట్ల బకాయిలను దశల వారీగా చెల్లించేందుకు చర్యలు చేపట్టింది.

రైతులందరికీ లబ్ధి చేకూర్చేందుకే..
రబీ 2019–20 సీజన్‌కు సంబంధించి వాస్తవ సాగుదారులకు మాత్రమే ఈ పథకం కింద లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేశాం. అయితే, ఎస్‌వీపీఆర్‌ పోర్టల్‌లో బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేసిన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలిచ్చారు. బ్యాంకర్లు అప్‌లోడ్‌ చేసిన జాబితాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకూ వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ అందనుంది. ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ లబ్ధిని వారి ఖాతాల్లో జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం.   
 – హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement