
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆమె నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలంటూ విజయవాడకు చెందిన గుర్రం రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ వ్యాజ్యంలో మరిన్ని అదనపు డాక్యుమెంట్లు దాఖలు చేసేందుకు పిటిషనర్ తరఫు న్యాయవాది సమయం కోరారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లేకుండా ఎందుకు పిల్ వేశారని ప్రశ్నించింది. పిల్ దాఖలు చేయడమంటే ఆషామాషీ అయిపోయిందని వ్యాఖ్యానించింది. వాయిదా కోసం న్యాయవాది పదే పదే అభ్యర్థించడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.