
సాక్షి, విశాఖపట్నం: అత్యంత ప్రభావవంతమైన విద్యాసంస్థలు, పరిశ్రమలతోపాటు ఆకర్షణీయమైన బీచ్‌లు ఉన్న విశాఖ నగరం నిజంగా ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కొనియాడారు. ముఖ్యంగా హైటెక్ వైద్య పరికరాల తయారీ, ఎగుమతుల్లో విశాఖపట్నంలోని ఏపీ మెడ్‌టెక్ జోన్ ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తోందన్నారు. మరింత పురోభివృద్ధి సాధించేందుకు అవసరమైన నిపుణులు రాష్ట్రంలో ఉన్నారని ప్రశంసించారు. ఆంధ్రా వైద్య కళాశాల (ఏఎంసీ) శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ శనివారం విశాఖ చేరుకున్నారు.
ముందుగా ఐఎన్‌ఎస్ డేగాలో తూర్పు నౌకాదళం, రాష్ట్ర ప్రభుత్వం అందించిన గార్డ్ ఆఫ్ ఆనర్, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా ఆంధ్రా వైద్య కళాశాలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి ఏఎంసీ శతాబ్ది ఉత్సవాల పైలాన్‌ని గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్‌నాథ్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతితో కలిసి ఆవిష్కరించారు.
అనంతరం ఏఎంసీలో రూ.20 కోట్లతో నిర్మించనున్న క్లినికల్ అండ్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు జగదీప్ ధన్‌ఖడ్ శంకుస్థాపన చేసి.. కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఆ తర్వాత బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన ఉత్సవాల సదస్సులో పాల్గొన్నారు. ఏఎంసీ సెంటినరీ కాఫీ బుక్, పోస్టల్ కవర్, స్టాంప్‌ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జగదీప్ ధన్‌ఖడ్ ఆంధ్రా వైద్య కళాశాల (ఏఎంసీ).. వైద్య నిపుణులను అందిస్తూ వైద్య రంగానికి బెంచ్‌మార్క్‌గా నిలుస్తోందని కొనియాడారు. 12 మంది పద్మ అవార్డుల్ని అందుకున్న ఏకైక వైద్య కళాశాలగా దేశంలోనే ఏఎంసీ చరిత్ర సృష్టించిందన్నారు. కోవిడ్ సమయంలో హెల్త్ వారియర్స్‌గా నిలిచిన వైద్యులు మరిన్ని పరిశోధనలు చేయాలని సూచించారు. వైద్య రంగంలో భారత్‌ను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దే బాధ్యతను ఏఎంసీ వంటి వైద్య కళాశాలలు తీసుకోవాలని కోరారు.
సీఎం వైఎస్ జగన్ సరికొత్త విప్లవం సృష్టించారు..
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మాటా్లడుతూ వైద్య కళాశాలల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏపీలో సరికొత్త విప్లవాన్ని సృష్టించారని తెలిపారు. క్యాన్సర్ వ్యాధికి సమగ్ర చికిత్స అందించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, నాలుగు క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
2030 నాటికి ఏపీకి చెందిన ఒక్క క్యాన్సర్ పేషెంట్ కూడా వైద్యం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పారు. త్వరలోనే ఏఎంసీ.. ఆంధ్రా మెడికల్ యూనివర్సిటీగా మారే దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. ఎంపీలు జీవీఎల్ నరసింహరావు, సీఎం రమేశ్, ఏఎంసీ సెంటినరీ కమిటీ చైర్మన్ డా.రవిరాజు, ఏఎంసీ ప్రిన్సిపాల్ జి.బుచ్చిరాజు, డీఎంఈ నరసింహంతోపాటు వైద్య ప్రముఖులు, వివిధ దేశాల నుంచి వచ్చిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
వైద్య రంగంలో ఉన్నత స్థాయి పరిశోధనలు జరగాలి..
గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ ప్రపంచానికి వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని అందించడంలో భారత్ అగ్రభాగంలో ఉందన్నారు. యూఎస్, యూకే, తదితర దేశాలతోపాటు యూరప్‌లో 70 వేలకు పైగా వైద్యులు భారత్ నుంచి వెళ్లినవారేనని తెలిపారు. అయినప్పటికీ వైద్య విద్యా కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య రంగంలో ఉన్నత స్థాయి పరిశోధనలు అవసరమని చెప్పారు.
ఏటా 25 వేల మంది భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదివేందుకు విదేశాలకు వెళ్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ తరహాలో దేశంలో మరిన్ని వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 10 వేల మందికి పైగా పూర్వ విద్యార్థులు ఉండటం ఏఎంసీకి గర్వకారణమన్నారు.