
సాక్షి, అమరావతి: ఆక్వా రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాదిరిగా గతంలో ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదని ఆక్వా రైతు సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం ప్రశంసించింది. నాన్ ఆక్వా జోన్ పరిధిలో ఉన్న వారిని ఆక్వా జోన్‌లోకి తీసుకురావడంతో ఆక్వా సబ్సిడీ ఆక్వా రైతులకు అందుతోందని వెల్లడించింది. గతంలో ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ మిల్లులు, హేచరీలతో రైతులు ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉండేది కాదనీ.. ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన అప్సడా చట్టం పుణ్యమా అని రైతులకు మేలు జరుగుతోందని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆక్వా రైతు సంఘాల ప్రతినిధుల రాష్ట్రస్థాయి సమావేశం బుధవారం విజయవాడలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ అధ్యక్షతన జరిగింది.
రైతులు ఏం అడిగారంటే..
సమావేశంలో రైతు ప్రతినిధులు మాట్లాడుతూ.. ట్రేడర్స్, ఏజెంట్లను కూడా అప్సడా పరిధిలోకి తీసుకొచి్చ, వారికి కూడా లైసెన్సులు జారీ చేయాలని కోరారు. రొయ్యల కొనుగోలుదారులు విధిగా సరైన బిల్లులు ఇచ్చేలా తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఆ బాధ్యతలను ఆర్బీకేల్లో ఉండే మత్స్య సహాయకులకు అప్పగించాలని కోరారు. 2024 నుంచి ఏటా మార్చి 15 నుంచి మే 15 వరకు 60 రోజుల పాటు రైతులందరూ సాగు సన్నాహాలు చేసుకునేందుకు వీలుగా డిసెంబర్ 15 నుంచి సీడ్ అమ్మకాలను హేచరీలు నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సాగు సన్నాహాలు కోసం కొద్దికాలం పాటు పనులు నిలిపి వేయడం వల్ల రైతులందరికీ మేలు జరుగుతుందని, ముఖ్యంగా పంటను వైరస్‌ల బారిన పడకుండా, బ్యాక్టీరియాల నుంచి తప్పించుకునేందుకు అవకాశం కలుగుతుందని వివరించారు. విద్యుత్ సబ్సిడీకి అర్హత ఉండి సాంకేతిక కారణాల వల్ల లబ్ధి పొందని వారికి సాధ్యమైనంత త్వరగా మేలు చేయాలని కోరారు. రొయ్యల స్థానిక వినియోగం పెంచేందుకు మ«ధ్యాహ్న భోజన పథకంతోపాటు జైళ్లు, మిలటరీ క్యాంటీన్లలో రొయ్య వంటకాలను చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
సీఎంను సత్కరించాలని తీర్మానం
రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. ఆక్వా రైతుల తరఫున సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ సమస్యల్ని సీఎం దృష్టికి తీసుకెళ్తున్న అప్సడా వైస్ చైర్మన్ రఘురామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో భీమవరంలో రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల సమ్మేళనం నిర్వహించి.. ఆక్వా రంగానికి అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సత్కరించాలని సమావేశంలో నిర్ణయించారు. జాతీయ రొయ్యరైతుల సమాఖ్య అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు, జిల్లాల రైతు ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment