సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోందని, దానికి తగినట్లు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ జెన్‌కో చైర్మన్ కె.విజయానంద్ చెప్పారు. దక్షిణ ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థలు, ఉత్పత్తి సంస్థలు కలిసికట్టుగా పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
విజయవాడలో బుధవారం జరిగిన సదరన్ రీజనల్ పవర్ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) 210వ ఆపరేషన్ కో ఆర్డినేషన్ సబ్‌కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో గత ఏడాది ఎవరూ ఊహించని విధంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ 265 మిలియన్ యూనిట్లకు చేరిందని గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు సమైక్యంగా పనిచేయాలని గత ఏడాది ఎస్‌ఆర్‌పీసీ నిర్ణయించిందని, ఇదే లక్ష్యంతో ఉత్తమ ఫలితాల సాధన దిశగా చర్చించి కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు.
ఈ ఏడాది విద్యుత్ డిమాండ్ పదిశాతం పెరుగుతుందని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) అంచనా వేసిందని చెప్పారు. దేశవ్యాప్తంగా 2030 వరకు విద్యుత్ డిమాండు పెరుగుదల ఇలాగే ఉంటుందని కేంద్ర ఇంధనశాఖ (పవర్ సెక్టార్) కూడా అంచనా వేసిందన్నారు. అందువల్లే గడువు దాటిన థర్మల్ విద్యుత్ కేంద్రాలను మూసేయకుండా పకడ్బందీగా మరమ్మతులు చేసి 2030 వరకు విద్యుత్ ఉత్పత్తి కొనసాగించాలని ఆదేశించిందని చెప్పారు. విద్యుత్ ఉత్పాదన సంస్థలు త్వరితగతిన మరమ్మతులు (ఓవరాయిలింగ్) పూర్తిచేయడంతో పాటు నిర్మాణంలో ఉన్న ప్లాంట్లను పూర్తిచేసి ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏపీకి కొంత అనుకూలం
కృష్ణపట్నంలో 800 మెగావాట్లు, డాక్టర్ ఎన్‌టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్లు గత ఏడాది సీవోడీ చేసుకుని వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించడం రాష్ట్రానికి చాలా వరకు కలిసి వచ్చే అంశమని చెప్పారు. గత నెలలో డాక్టర్ ఎన్‌టీటీపీఎస్‌లో 800 మెగావాట్ల యూనిట్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టడంతో అదనంగా 15 నుంచి 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులోకి వచ్చిందన్నారు. భవిష్యత్తులో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లకు అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ అంశం థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సవాల్‌గా మారుతుందని పేర్కొన్నారు.
విద్యుత్ ఉత్పత్తి పెంపుదల, సరఫరాలో సమస్యలపై చర్చించి ఉత్తమ పరిష్కార మార్గాలకు అన్వేషించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్ కె.వి.భాస్కర్, ఏపీ జెన్‌కో డైరెక్టర్లు బాబ్జీ (థర్మల్), సయ్యద్ రఫి (హెచ్‌ఆర్), ఎస్‌ఆర్‌పీసీ 210వ ఆపరేషన్ కో ఆర్డినేషన్ సబ్‌కమిటీ మెంబర్ సెక్రటరీ అసిత్‌సింగ్, పలువురు ఉన్నతాధికారులు, ఎన్‌టీపీసీతోపాటు దక్షిణాది రాష్ట్రాల ట్రాన్స్‌కో, జెన్‌కో ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment